టీడీపీ అధినేత చంద్రబాబుకు మరో ముఖ్యమైన పనిబడింది. ఒకరకంగా ఇది ఆయనకు పెద్ద తలనొప్పి వ్యవహారం కూడా. అంత ఇంపార్టెంట్ పని, అంత తలనొప్పి వ్యవహారం ఏమిటి ? త్వరలోనే తెలంగాణా టీడీపీ చుక్కాని లేని నావలా మారబోతున్నది. టీడీపీ నావను నడుపుతున్న సరంగు మరో పడవలోకి వెళ్ళిపోతున్నాడు. అంటే తెలంగాణా టీడీపీ అధ్యక్షుడు ఎల్. రమణ గులాబీ పార్టీలోకి జంప్ అవబోతున్నట్లు ఈ మధ్యనే వార్తలు వచ్చాయి కదా. ఇప్పుడు ఆయన జంపింగ్ పైన క్లారిటీ వచ్చేసింది.
మరో వారం రోజుల్లో గులాబీ కండువా కప్పుకుంటాడట. టీడీపీలో రమణకు రాజకీయ భవిష్యత్తు కరువైంది. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆ భవిష్యత్తు ఇస్తానన్నారు. నువ్వు టీడీపీలో ఖాళీగా కూర్చొని ఈగలు కొట్టుకోడం ఎందుకయ్యా ..మా పార్టీలోకి వస్తే నువ్వు ఈగలు కొట్టుకోకుండా ఎమ్మెల్సీ పదవి ఇస్తాను. ఎలాగూ కొన్ని స్థానాలు ఖాళీ అవుతున్నాయి కదా. నీకూ ఒకటి ఇస్తాను అన్నారు కేసీఆర్. ఎమ్మెల్సీ పదవి ఆరేళ్ళు. హాయిగా కాలుమీద కాలు వేసుకొని కూర్చుంటే జీవితం గడిపేయొచ్చు.
ఒకవేళ టీఆర్ఎస్ అధికారంలో లేకపోయినా తన ఎమ్మెల్సీ పదవికి ఢోకా ఉండదని రమణ భావించి ఉంటాడు. ఆలసించిన ఆశాభంగం అని కూడా కేసీఆర్ దూతల ద్వారా కబురు పంపారు. అన్నీ ఆలోచించాక రమణ జంపింగ్ కు రంగం సిద్ధం చేసుకున్నాడు. తాజాగా తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్. రమణ ఆ పార్టీకి గుడ్ బై చెప్పేందుకు సిద్ధమయ్యాడు. జగిత్యాలలో మకాం వేసి తన అనుచరుల అభిప్రాయాలు తెలుసుకున్నాడు. ప్రస్తుత పరిస్థితుల్లో టీడీపీకి భవిష్యత్ లేదని పార్టీ మారడమే మంచిదని కార్యకర్తలు చెప్పారట.
మరో వారం రోజుల్లో రమణ గులాబీ కండువా కప్పుకుంటాడని సమాచారం. తాను పార్టీ ఎందుకు మారుతున్నానో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకు వివరించాలని రమణ అనుకున్నట్టు తెలుస్తోంది. కానీ చంద్రబాబు రమణను కలిసేందుకు విముఖత చూపినట్టు సమాచారం. రమణను కలవడానికి చంద్రబాబు ఏ మాత్రం సుముఖంగా లేరట. దీంతో రమణ వెళ్లిపోయేముందు తన బాస్ తో మాట్లాడే అవకాశం కలగకపోవచ్చు. రమణ వెళ్ళిపోగానే చంద్రబాబు తెలంగాణా టీడీపీ అధ్యక్ష పదవి కోసం మరో నాయకుడిని వెదుక్కోవాలి.
ప్రస్తుత పరిస్థితుల్లో అదంత సులభం కాదు. అధ్యక్ష పదవి తీసుకోవడానికి ఎవరు ముందుకొస్తారు ? తెలంగాణలో చనిపోయిన పార్టీకి ఎవరు ప్రాణం పోస్తారు ? టీడీపీ అధ్యక్ష పదవిని తీసుకొని రిస్క్ పడటానికి ఎవరూ సిద్ధంగా ఉండకపోవచ్చు.ఇప్పుడు అధ్యక్ష పదవి తీసుకునే నాయకుడు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి పార్టీని సిద్ధం చేయాల్సి ఉంటుంది. అసెంబ్లీ ఎన్నికలకు టీడీపీ దూరంగా ఉండే ప్రసక్తే లేదు. గెలుపోటముల సంగతి తరువాత. ఎన్నికల్లో పోటీ చేయడం ద్వారా టీడీపీ తన ఉనికిని కాపాడుకోవాలి.
అలా ఉనికిని కాపాడే నాయకుడి కోసం ఇప్పుడు చంద్రబాబు అన్వేషించాలి. వాస్తవానికి రమణకు అంత సమర్దుడిగా పేరు లేదు. ఆయన బీసీ సామాజిక వర్గానికి చెందినవాడు కాబట్టి అధ్యక్ష పదవి ఇచ్చారు. రమణ పనితీరుపై ఇదివరకు కొన్నిసార్లు చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. కానీ రమణను అధ్యక్ష పదవిలో కొనసాగించడానికి ఆయన సామాజిక వర్గం ఒక కారణమైతే, పార్టీకి విధేయుడన్న అభిప్రాయం మరో కారణం.
పార్టీలో దిగ్గజాలవంటి నాయకులంతా ఎప్పుడో గులాబీ పార్టీలోకి వెళ్లిపోయారు. ఇప్పుడు వేళ్ళమీద లెక్కపెట్టగలిగినంతమంది నాయకులు తప్ప ఎవరూ మిగల్లేదు. ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు ఏం చేయబోతున్నారు ?