డిప్రెషన్.. ఈ ఆధునిక జీవితంలో ప్రతి ఒక్కర్ని కుంగదీస్తున్న సమస్య. గ్లామర్ ఫీల్డ్ లో ఉన్న హీరోయిన్లు కూడా దీనికి అతీతం కాదు. చాలామంది డిప్రెషన్ ను ఎదుర్కొన్నారు. శృతిహాసన్, దీపిక పదుకోన్ లాంటి కొంతమంది మాత్రమే దీనిపై మాట్లాడారు. తాజాగా దీపిక పదుకోన్ మరోసారి తన డిప్రెషన్ పై స్పందించింది.
“నేను 2014 లో డిప్రెషన్‌తో బాధపడ్డాను. ప్రజలు దాని గురించి మాట్లాడకపోవడం నాకు విచిత్రంగా అనిపించింది. ఆ టైమ్ లో ఈ సమస్య గురించి చాలామందికి తెలియదు. అంతేకాదు, ఆ సమయంలో నాలానే చాలా మంది డిప్రెషన్‌ని ఎదుర్కొంటున్నారని నేను గ్రహించాను. జీవితంలో నా ఆశయం ఏంటంటే, నేను కనీసం ఒక్క జీవితాన్ని కాపాడగలిగినా, నా లక్ష్యాన్ని అందుకున్నట్టే. ఈ దిశగా మేం చాలా సాధించాం.”
తనకున్న డిప్రెషన్ లక్షణాల్ని బయటపెట్టింది దీపిక. పొద్దున్న లేచిన వెంటనే ఓ రకమైన ఫీలింగ్ ఉండేదని, ఏదో శూన్యంలోకి చూస్తున్న అనుభూతి కలిగేదని చెప్పుకొచ్చింది. ఎక్కడికీ వెళ్లాలని, పని చేయాలని అనిపించేది కాదని, తనకు బ్రతకాలని అనిపించేది కాదని, తన జీవితానికి అర్థం లేదని అనిపించేదని చెప్పుకొచ్చింది. తన తల్లి సలహా మేరకు వైద్యుడ్ని కలిశానని చెప్పుకొచ్చింది.
“ఓసారి నన్ను చూడ్డానికి అమ్మా-నాన్న ముంబయి వచ్చారు. తిరిగి బెంగళూరు వెళ్తున్నప్పుడు డ్రాప్ చేయడానికి ఎయిర్ పోర్ట్ కు వెళ్లాను. వాళ్లు వెళ్లిపోతుంటే నాకు ఏడుపొచ్చింది. ఆ ఏడుపు చాలా కొత్తగా ఉందనే విషయాన్ని మా అమ్మ గ్రహించింది. ఏదో సహాయం కోసం ఏడుస్తున్నట్టు అనిపించింది. వైద్యుడ్ని సంప్రదించమని అమ్మ చెప్పింది. ఆ క్షణం నుంచి నా ట్రీట్ మెంట్ మొదలైంది.”
అలా నెలల తరబడి పోరాటం చేసి డిప్రెషన్ నుంచి బయటకొచ్చింది దీపక పదుకోన్. దీనిపై భారతీయుల్లో మరింత అవగాహన కల్పించేందుకు, డిప్రెషన్ నుంచి బయటపడేసేందుకు లివ్-లవ్-లాఫ్ ఫౌండేషన్ ను స్థాపించింది. దీని ద్వారా డిప్రెషన్ ఎదుర్కొంటున్న ఎంతోమందికి సహాయం అందిస్తోంది.