రష్మిక కేసుపై పోలీసుల యాక్షన్ షురూ

నేషనల్ క్రష్ రష్మికపై ఎవరో అగంతకుడు డీప్ ఫేక్ వీడియో క్రియేట్ చేసి సోషల్ మీడియాలో పెట్టిన సంగతి తెలిసిందే. దీనిపై బిగ్ బి అమితాబ్ నుంచి టాలీవుడ్ ప్రముఖుల వరకు చాలామంది స్పందించారు.…

నేషనల్ క్రష్ రష్మికపై ఎవరో అగంతకుడు డీప్ ఫేక్ వీడియో క్రియేట్ చేసి సోషల్ మీడియాలో పెట్టిన సంగతి తెలిసిందే. దీనిపై బిగ్ బి అమితాబ్ నుంచి టాలీవుడ్ ప్రముఖుల వరకు చాలామంది స్పందించారు. ఈ చర్యను తీవ్రంగా ఖండించారు. దీంతో కేంద్రం కూడా కదిలింది. రష్మిక కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.

డీప్ ఫేక్ వీడియోకు సంబంధించి ఇప్పటికే ఢిల్లీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసిన సంగతి తెలిసిందే. అలా ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిన 24 గంటల్లోనే చర్యలు మొదలయ్యాయి. ఈ కేసును వీలైనంత తొందరగా ఛేదించేందుకు ప్రత్యేక బృందాన్ని నియమించింది పోలీసు శాఖ. ఆ స్పెషల్ బ్రాంచ్ అల్రెడీ తమ పని మొదలుపెట్టింది.

ఎంక్వయిరీలో భాగంగా ఏ ఐపీ నుంచి ఆ వీడియో తయారైందో తెలుసుకోవాలని పోలీసులు నిర్ణయించారు. దీని కోసం మెటా సంస్థకు లేఖ రాశారు. మెటా ఇచ్చే వివరాల ఆధారంగా కేసు విచారణను వేగవంతం చేయాలని భావిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి మెటా ఇచ్చే సమాచారమే కీలకం. పోలీసులు కోరిన వివరాలన్నింటినీ ఆ కంపెనీ ఇస్తే, కేసు దాదాపు కొలిక్కి వచ్చినట్టే. ఎందుకంటే, మెటా దగ్గర తన వినియోగదారుడికి సంబంధించిన సమస్త సమాచారం ఉంటుంది.

మరోవైపు ఈ కేసును ఢిల్లీ మహిళా కమిషన్ కూడా సీరియస్ గా తీసుకుంది. ఇకపై ఇలాంటివి మరిన్ని జరగకుండా గట్టి చర్యలు తీసుకోవాలని, రష్మిక కేసుకు సంబంధించి ఎప్పటికప్పుడు తమకు సమాచారం అందించాలని పోలీసులను ఆదేశించింది.

ఐపీసీలోని సెక్షన్లు 465 (ఫోర్జరీ), 469 (పరువుకు హాని కలిగించే ఉద్దేశంతో ఫోర్జరీ చేయడం), ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ లోని సెక్షన్లు 66C, 66E కింద ఢిల్లీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అతి తక్కువ రోజుల్లోనే డీప్ ఫేక్ కు పాల్పడిన వ్యక్తి ని పట్టుకుంటామని చెబుతున్నారు.