దర్శకుడు దేవ కట్టా కెరీర్ లో బాగా గ్యాప్ వచ్చేసింది. అయితే ఇకపై అలాంటి గ్యాప్ రాకుండా చూసుకుంటానంటున్నాడు ఈ డైరక్టర్. మరీ ముఖ్యంగా ఈసారి 6-7 కథలు రెడీ చేసుకున్నానని, వాటిలో 2-3 కథలు అద్భుతంగా వచ్చాయని అంటున్నాడు. తను చచ్చిపోయేలోపు ఆ కథల్ని ప్రేక్షకులకు కచ్చితంగా చూపిస్తానంటున్నాడు.
“6-7 కథలతో నేను రెడీగా ఉన్నాను. అన్నీ కొత్త పాయింట్లే. రిపబ్లిక్ రిలీజైన 3 నెలలకే మరో సినిమా స్టార్ట్ చేసేంత రెడీగా ఉన్నాను. రిపబ్లిక్ తర్వాత అటుఇటు వెళ్లను. ఎందుకంటే ఓటీటీలో కష్టం ఎక్కువ, ఫలితం తక్కువ. అందుకే కేవలం సినిమాకే ఫిక్స్ అవుతాను. కనీసం 4-5 ఏళ్లు సినిమాలే చేస్తాను. నా దగ్గర 2-3 బలమైన కథలున్నాయి. అవి జనాలకు చెప్పకుండా నేను చచ్చిపోయానంటే నా జన్మకు అర్థం ఉండదు. కాబట్టి ఆ కథల్ని ముందుగా సినిమాలుగా తీసిన తర్వాతే, ఓటీటీ లాంటి మిగతా అంశాల గురించి ఆలోచిస్తాను.”
ఇలా తన లైనప్ గురించి బయటపెట్టాడు దేవ కట్టా. రిపబ్లిక్ మూవీతో త్వరలోనే ప్రేక్షకుల ముందుకొస్తున్న ఈ దర్శకుడు.. ఆ సినిమా తర్వాత పొలిటికల్ కథలకు కొన్నాళ్లు విరామం ఇస్తానంటున్నాడు. కొత్త జానర్లు టచ్ చేస్తానంటున్నాడు.
“టీనేజ్ లవ్ స్టోరీ కథ ఒకటి ఉంది. దీంతోపాటు మరో స్టోరీ కూడా ఉంది. 17 ఏళ్ల టీనేజ్ అమ్మాయితో మొదలుపెట్టి, 45 ఏళ్ల తల్లిగా ఆమె మారిన జర్నీతో ఓ కథ ఉంది. దుబాయ్ కేంద్రంగా మాఫియా బ్యాక్ డ్రాప్ కథ కూడా ఒకటి ఉంది. ఇలా కొత్త జానర్లు టచ్ చేస్తున్నాను. ఇవన్నీ ప్రేక్షకులకు చెప్పాలని ఉంది.”
ప్రస్థానం, ఆటోనగర్ సూర్య, రిపబ్లిక్ సినిమాలతో ఆ జానర్ సినిమాల్ని తాత్కాలికంగా ఆపేస్తానంటున్నాడు దేవకట్టా. ఇక రిపబ్లిక్ విషయానికొస్తే, ఈ సినిమాలో క్లయిమాక్స్ చాలా కొత్తగా ఉంటుందని చెబుతున్నాడు. సాయిధరమ్ తేజ్ ఈ సినిమా చేయడానికి కారణం క్లైమాక్స్ అంటున్నాడు.