అవకాశం ఇస్తే మోకాలికి, బోడి గుండుకి ముడేసేవారు చాలామందే ఉన్నారు ఏపీలో. ముఖ్యంగా ప్రతిపక్షాలు, వారు చెప్పినట్టల్లా ఆడే మీడియా.. ఈ అంశంలో రాటుదేలిపోయాయి. ఏపీలో వినాయక చవితి పండగ విషయంలో రగడ జరుగుతున్న విషయం తెలిసిందే.
జగన్ ని హిందూ ద్వేషి అని, హిందూ మత సంప్రదాయాలను తుంగలో తొక్కుతున్నారని విమర్శిస్తున్నారు బీజేపీ నేతలు. టీడీపీ, జనసేన కూడా వంతపాడుతున్నాయి. ఈ క్రమంలో టీటీడీ నిన్న సర్వదర్శనంపై సడన్ గా నిర్ణయం తీసుకుంది. 6 నెలలుగా తిరుమలలో ఆగిపోయిన సర్వ దర్శనాలను పునఃప్రారంభిస్తున్నట్టు చెప్పింది.
అయితే వైసీపీ ప్రభుత్వం వినాయక చవితి విషయంలో వస్తున్న ప్రజా వ్యతిరేకతను కప్పి పుచ్చుకోడానికే టీటీడీతో సర్వదర్శనానికి గ్రీన్ సిగ్నల్ ఇప్పించిందని ఓ వర్గం ఆరోపిస్తోంది.
అసలు టీటీడీ నిర్ణయానికి ప్రభుత్వానికి సంబంధం ఉందా..?
టీటీడీ స్వతంత్రంగా తీసుకునే నిర్ణయాలకు, ప్రభుత్వానికి ప్రత్యక్ష సంబంధం ఉంటుందా అనేది అనుమానమే. అదే నిజమైతే.. ఈపాటికే ఇతర ఆలయాల లాగా తిరుమలలో కూడా సర్వదర్శనాలు మొదలయ్యేవి. కానీ ఈసారి టీటీడీ చాలా కఠినంగా ఉంది.
సెకండ్ వేవ్ ప్రభావం తగ్గి చాలా రోజులవుతున్నా.. ఉచిత దర్శనాలకు అనుమతివ్వలేదు. కరోనా భయాలు పూర్తిగా తొలగిపోతున్న వేళ, సాధారణ భక్తుల నుంచి తీవ్ర ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో, టీటీడీ సర్వదర్శనాలపై నిర్ణయం తీసుకుంది. అది కూడా రోజుకి 2వేల పరిమిత సంఖ్యలో కొన్నిరోజుల పాటు చిత్తూరు భక్తులకు మాత్రమే దర్శనాలు అని చెప్పింది.
అయితే బీజేపీలోని ఓ వర్గం మాత్రం టీటీడీ స్వతంత్రంగా తీసుకున్న నిర్ణయానికి, వినాయక చవితి పండగపై ఉన్న నిషేధానికి లింకు పెడుతూ మాట్లాడుతోంది. మండపాలు పెట్టి పూజలు చేస్తే కరోనా వస్తుందంటే, తిరుమలలో సర్వ దర్శనాలు ఎందుకు మొదలు పెడుతున్నారని మరికొందరు వితండవాదం చేస్తున్నారు.
ప్రభుత్వం ఆంక్షలు విధించకపోతే.. మీ వల్లే కరోనా పెరిగిపోయిందని చెప్పడానికి రెడీగా ఉండే ఈ బ్యాచ్.. నిబంధనలు పెట్టడంతో హిందూ పండగలపై వ్యతిరేకత, హిందూ వ్యతిరేకత అంటూ రెచ్చిపోతున్నారు.
కేంద్రం స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చినా కూడా ఏపీలోని నాయకులంతా రాష్ట్ర ప్రభుత్వాన్నే టార్గెట్ చేయాలనుకోవడం నిజంగా దురదృష్టకరం. సెకండ్ వేవ్ ప్రభావం తగ్గుతున్న వేళ, ముప్పుని కొని తెచ్చుకోవాలనుకోవడం నిజంగా మూర్ఖత్వం.