పవన్ ఢిల్లీ ప్రయాణం.. జనసైనికుల్లో ఆత్రం

పవన్ కల్యాణ్ కి ఫ్రీ పబ్లిసిటీ కావాలి, సోషల్ మీడియా ద్వారా అది కొంత సాధ్యపడినా.. మెయిన్ స్ట్రీమ్ మీడియా ఆయన్ను పెద్దగా పట్టించుకోదు. అయితే అప్పుడప్పుడు పవన్ ప్రచారాలు, టూర్లు మాత్రం ఎక్కడలేని…

పవన్ కల్యాణ్ కి ఫ్రీ పబ్లిసిటీ కావాలి, సోషల్ మీడియా ద్వారా అది కొంత సాధ్యపడినా.. మెయిన్ స్ట్రీమ్ మీడియా ఆయన్ను పెద్దగా పట్టించుకోదు. అయితే అప్పుడప్పుడు పవన్ ప్రచారాలు, టూర్లు మాత్రం ఎక్కడలేని సస్పెన్స్ కి తెరతీస్తుంటాయి. 

అసలు విషయం ఏమీ లేకపోయినా హడావిడి చేయడంలో చంద్రబాబుకి పోటీగా తయారవుతున్నారు పవన్. తాజాగా ఆయన ఢిల్లీ వెళ్లారు. ఎందుకు వెళ్లారు అనే విషయంపై రకరకాల చర్చలు జరుగుతున్నాయి.

వివాహ వేడుకకే పరిమితం..

పవన్ కల్యాణ్ ఢిల్లీ వెళ్లింది కేవలం ఓ వివాహ వేడుకలో పాల్గొనడానికి మాత్రమే. పార్లమెంటరీ వ్యవహారాలు, కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి కుమార్తె మ్యారేజ్ రిసెప్షన్ లో పాల్గొనడానికి పవన్ ఢిల్లీకి వెళ్లారు. అయితే అంతలోనే ఇక్కడ ఆయన అనుకూల వర్గం మీడియా, సోషల్ మీడియా మొత్తం పవన్ ఢిల్లీ టూర్ ని ఓ పొలిటికల్ టూర్ గా అభివర్ణించింది, ఆహా ఓహో అంటూ బాకాలూదింది. 

జగన్, కేసీఆర్, ఆ తర్వాత పవన్.. అబ్బో పెద్ద నాయకులంతా ఢిల్లీ వెళ్తున్నారంటూ పవన్ ని కూడా ఆ జాబితాలో చేర్చేసింది. జనసైనికులైతే తమ నాయకుడు ఢిల్లీ వెళ్లారంటూ పండగ చేసుకుంటున్నారు.

ఎందుకీ ఆర్భాటం..

రిసెప్షన్ పార్టీలో పవన్ కల్యాణ్ ఎవరెవర్ని కలిశారు అనే విషయం బయటకు రాలేదు కాబట్టి, ఎవరైనా ఏమైనా మాట్లాడొచ్చు. అయితే అక్కడిదాకా వెళ్లిన పవన్ తో వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు ఫొటో దిగి ఫ్రీ పబ్లిసిటీ చేసుకుంటున్నారు. 

ఇది పవన్ ఇమేజ్ ని డ్యామేజీ చేయడం మినహా ఇంకేమీ కాదు. ఢిల్లీ వెళ్లిన పవన్ ప్రధాని మోదీనో, ఇంకెవరినైనా కలిస్తే అది వార్త. అంతదూరం వెళ్లి రఘురామకృష్ణంరాజుతో ఫొటో దిగి ఎంచక్కా వెనక్కు వస్తే అందులో ప్రాధాన్యం ఏముంది? పైపెచ్చు పవన్ ను మరింత అనుమానించాల్సి వస్తుంది.

ఇక్కడ జనసేన వర్గాలు మాత్రం మరో రకంగా ప్రచారం చేసుకుంటున్నాయి. జనసేన-బీజేపీ భవిష్యత్ రాజకీయాలకు వ్యూహ రచన జరిగిందని, ఢిల్లీలో పవన్ పెద్ద పెద్దవారితో భేటీ అవుతున్నారని చెప్పుకుంటున్నారు. బహుశా వాళ్ల దృష్టిలో ఇటు వైసీపీకి, అటు బీజేపీకి కాకుండా పోయిన రఘురామకృష్ణంరాజు పెద్ద మనిషేమో.

ఏపీపై బీజేపీకి ఆశల్లేవు..

ఈమధ్య తెలంగాణలో జరిగిన ప్రతి ఎన్నికలకూ కేంద్రం నుంచి ప్రత్యేక బ్యాచ్ రంగంలోకి దిగుతోంది. అమిత్ షా దగ్గర్నుంచి ముఖ్యనేతలంతా తెలంగాణ అంటే చాలు పరిగెత్తుకు వస్తారు. ఎందుకంటే అక్కడ పార్టీ బతికి బట్టగట్టే అవకాశముందని వారు బలంగా నమ్ముతున్నారు. కానీ ఏపీలో బీజేపీపై కానీ, జనసేన స్నేహంపై కానీ అధిష్టానానికి పెద్దగా ఆశల్లేవు. అందుకే పవన్ కల్యాణ్ కి కూడా ఎవరూ అపాయింట్ మెంట్ ఇవ్వడం లేదు.

పోనీ ఇలాంటి ఫంక్షన్లకు వచ్చినప్పుడైనా పవన్ ని పట్టించుకుంటారా అంటే అదీ లేదు. ఏదో మొహమాటానికి వారు రమ్మన్నారు, ఈయన ఆగకుండా పరిగెత్తుకు వెళ్తున్నారు. ఢిల్లీ నుంచి ఎవరు పిలిచినా పలుకుతా అనేలా ఉన్నారు జనసేనాని. ఢిల్లీలో ఏ కార్యక్రమానికి వెళ్లినా, అదేదో పెద్ద అచీవ్ మెంట్ లా ఆయన ఫీలవుతున్నారు.