ఫస్ట్ లుక్ కు అర్థం మార్చిన హీరో

సాధారణంగా ఓ సినిమా నుంచి ఫస్ట్ లుక్ వస్తోందంటే అది ఎలా ఉంటుందో ఎవరైనా ఇట్టే ఊహించుకోవచ్చు. హీరో ఫొటో మాత్రమే కనిపిస్తుంది. కథ ఎంత బాగున్నా, ఎంత పెద్ద సినిమా అయినా ఫస్ట్…

సాధారణంగా ఓ సినిమా నుంచి ఫస్ట్ లుక్ వస్తోందంటే అది ఎలా ఉంటుందో ఎవరైనా ఇట్టే ఊహించుకోవచ్చు. హీరో ఫొటో మాత్రమే కనిపిస్తుంది. కథ ఎంత బాగున్నా, ఎంత పెద్ద సినిమా అయినా ఫస్ట్ లుక్ అనగానే హీరో మాత్రమే కనిపిస్తాడు.

కానీ ఈ లెక్కల్ని మార్చేశాడు ధనుష్. తన ప్రతిష్టాత్మక సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్ లో తనతో పాటు మరో ఇద్దరికి చోటిచ్చాడు. అదే ఇప్పుడు ప్రత్యేకత సంతరించుకుంది.

తన కెరీర్ లో ప్రతిష్టాత్మక 50వ సినిమా చేస్తున్నాడు ధనుష్. ఇందులో నటించడమే కాకుండా, స్వయంగా దర్శకత్వం కూడా వహిస్తున్నాడు. ఈ సినిమా నుంచి తాజాగా ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ధనుష్ తో పాటు, సందీప్ కిషన్, కాళిదాస్ జయరామ్ కు ఫస్ట్ లుక్ లో చోటిచ్చారు. ఈ సినిమాకు రాయన్ అనే పేరుపెట్టారు.

హీరోయిజం కంటే కథనే ఎక్కువ నమ్ముకుంటాడు ధనుష్. ఫస్ట్ లుక్ పోస్టర్ నుంచి ట్రయిలర్ వరకు ప్రతిది తన సినిమా కథను వివరించాలనుకుంటాడు. 50వ చిత్రంలో కూడా అదే పని చేశాడు. తనతో పాటు మరో 2 పాత్రలు కూడా కీలకం అనే విషయాన్ని చెప్పకనే చెప్పాడు.

రీసెంట్ గా ఈ సినిమా గురించి సందీప్ కిషన్ గొప్పగా చెప్పాడు. ఎవ్వరూ ఊహించని కథ, క్యారెక్టరైజేషన్ తో ఆ సినిమా వస్తోందని, ప్రతి ఒక్కరు షాక్ అవుతారని అన్నాడు. అతడు చెప్పినదానికి ఏమాత్రం తీసిపోనివిధంగా ఉంది ఫస్ట్ లుక్.

సన్ పిక్చర్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాను తమిళం, తెలుగు, హిందీ భాషల్లో ఒకేసారి విడుదల చేస్తారు. ఏఆర్ రెహ్మాన్ సంగీతం అందిస్తున్నాడు. సెల్వ రాఘవన్, ఎస్ జే సూర్య కీలక పాత్రలు పోషిస్తున్నారు.