చిరంజీవి, నాగ‌బాబుకు ఇదే తేడా!

మెగా బ్ర‌ద‌ర్స్ చిరంజీవి, నాగ‌బాబు వ్య‌వ‌హార శైలిలో చాలా తేడా. చిరంజీవి గొడ‌వ‌లు కోరుకునే వ్య‌క్తి కాదు. అంద‌రితో స‌ర్దుకుపోయే మ‌న‌స్త‌త్వం. ఎవ‌ర్నీ హ‌ర్ట్ చేయాల‌ని క‌ల‌లో కూడా ఊహించ‌రు. ప్ర‌తిదీ ఆచితూచి వ్య‌వ‌హ‌రిస్తారు.…

మెగా బ్ర‌ద‌ర్స్ చిరంజీవి, నాగ‌బాబు వ్య‌వ‌హార శైలిలో చాలా తేడా. చిరంజీవి గొడ‌వ‌లు కోరుకునే వ్య‌క్తి కాదు. అంద‌రితో స‌ర్దుకుపోయే మ‌న‌స్త‌త్వం. ఎవ‌ర్నీ హ‌ర్ట్ చేయాల‌ని క‌ల‌లో కూడా ఊహించ‌రు. ప్ర‌తిదీ ఆచితూచి వ్య‌వ‌హ‌రిస్తారు. కానీ ఆయ‌న త‌మ్ముడు నాగ‌బాబు స్వ‌భావం చిరుతో పోల్చితే పూర్తి విరుద్ధం. మ‌న‌సులో ఏదీ దాచుకునే ర‌కం కాదు. ఏదైనా వెంట‌నే మాట్లాడితే త‌ప్ప మ‌న‌సు తేలిక‌ప‌డ‌దు.

మ‌హాత్మాగాంధీని చంపిన గాడ్సేని పొగ‌డ‌డం ఆయ‌న‌కే చెల్లింది. ఇక ప్ర‌స్తుతానికి వ‌స్తే… ప్ర‌ముఖ ప్ర‌వ‌చ‌న‌క‌ర్త గ‌రిక‌పాటి న‌ర‌సింహారావుపై త‌న మార్క్ వ్యంగ్య ట్వీట్ చేయ‌డం చ‌ర్చ‌కు దారి తీసింది. నాగ‌బాబు ట్వీట్ మెగా అభిమానులు, జ‌న‌సేన కార్య‌క‌ర్త‌ల‌కు న‌చ్చి వుంటుందే త‌ప్ప‌, మిగిలిన వారెవ‌రూ అంగీక‌రించ‌డం లేదు. నాగ‌బాబుకెందుకంత ఆవేశం అనే ప్ర‌శ్న ఉత్ప‌న్న‌మైంది.

అదే వేదిక‌పై గ‌రిక‌పాటికి చిరంజీవి క్ష‌మాప‌ణ చెప్ప‌డం విశేషం. మ‌రి నాగ‌బాబు క్ష‌మాప‌ణ చెబుతారా? అనే ప్ర‌శ్న వెల్లువెత్తుతోంది. హ‌ర్యానా గ‌వ‌ర్న‌ర్ ద‌త్తాత్రేయ అల‌య్‌బ‌ల‌య్ కార్య‌క్ర‌మాన్ని ఏర్పాటు చేశారు. ప్ర‌ముఖ ప్ర‌వ‌చ‌న‌క‌ర్త గ‌రిక‌పాటి న‌ర‌సింహా రావు, చిరంజీవి త‌దిత‌ర ముఖ్యులు హాజ‌ర‌య్యారు. వేదిక‌పై మెగాస్టార్ చిరంజీవితో అభిమానులు ఫోటో సెష‌న్ ఏర్పాటు చేశారు. త‌న ప్ర‌సంగానికి ఈ ఫొటో సెష‌న్ అంత‌రాయం క‌లిగిస్తుండ‌డంతో గ‌రిక‌పాటి అస‌హ‌నానికి గుర‌య్యారు.

దీంతో ఆయ‌న కాస్త క‌ఠినంగా మాట్లాడారు. ఫొటో సెష‌న్ ఆపితే త‌ప్ప తాను మాట్లాడ‌న‌ని తేల్చి చెప్పారు. త‌న‌కేం మొహ‌మాటం లేద‌న్నారు. ‘చిరంజీవి గారు మీరు ఆపేసి …ఈ ప‌క్క‌కు రండి. నేను మాట్లాడ్తాను. చిరంజీవి గారికి నా విజ్ఞ‌ప్తి. ఫొటో సెష‌న్ ఆపేసి ఇక్క‌డికి రావాలి. లేదంటే నాకు సెల‌వు ఇప్పించండి’ అని గ‌ట్టిగా అన్నారు. ఆ వెంట‌నే చిరంజీవి ఎంతో హుందాగా ఫొటో సెష‌న్‌ను నిలిపేసి గ‌రిక‌పాటి వ‌ద్ద‌కెళ్లారు. గ‌రికపాటికి చిరంజీవి క్ష‌మాప‌ణ చెప్పారు.  

మీ ప్ర‌వ‌చ‌నాలంటే ఎంతో ఇష్ట‌మ‌ని, ఆసక్తిగా వింటాన‌ని గ‌రిక‌పాటితో చిరంజీవి చెప్పారు. ఒక‌రోజు త‌మ ఇంటికి భోజ‌నానికి రావాల‌ని గ‌రిక‌పాటిని చిరంజీవి ఎంతో అభిమానంతో ఆహ్వానించారు. చిరంజీవి విన‌మ్ర‌త‌కు బ‌హుశా గ‌రిక‌పాటి కూడా ప‌శ్చాత్తాప ప‌డి వుంటారు. చిరంజీవి అంత‌టి హీరో విష‌యంలో తాను అలా వ్య‌వ‌హ‌రించ వుండ‌కూడ‌ద‌ని గ‌రిక‌పాటి త‌న‌కు తాను మంద‌లించుకుని వుంటారు.

అయితే త‌న అన్న‌కు తీర‌ని అవ‌మానం జ‌రిగింద‌ని నాగ‌బాబు ట్విట‌ర్ తెర‌పైకి వ‌చ్చారు. ‘ఏపాటి వాడికైనా  చిరంజీవి గారి ఇమేజ్ చూస్తే ఆ పాటి  అసూయ పడటం పరిపాటే’ అంటూ నాగ‌బాబు ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌పై విమ‌ర్శ‌లొచ్చాయి. చిన్నాపెద్దా అనే తేడా లేకుండా నాగ‌బాబు ఘాటుగా రియాక్ట్ అవుతుంటార‌ని త‌ప్పు ప‌డుతున్నారు. గ‌రిక‌పాటికి త‌న అన్నే క్ష‌మాప‌ణ చెప్పార‌ని, నాగ‌బాబు ఏం స‌మాధానం చెబుతార‌ని నెటిజ‌న్లు ప్ర‌శ్నిస్తున్నారు. నాగ‌బాబు సంయ‌మ‌నంతో వ్య‌వ‌హ‌రిస్తే ఆయ‌న‌కే మంచిద‌ని హిత‌వు చెబుతున్నారు.