టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి…ఇద్దరూ చంద్రగిరి నియోజకవర్గం నుంచే రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. చంద్రగిరి నుంచి చంద్రబాబునాయుడు ఒకే ఒక్కసారి గెలుపొందారు రెండోసారి ఎన్టీఆర్ సునామీలో చంద్రగిరి నుంచి చంద్రబాబు ఓడిపోయారు. దీంతో చంద్రగిరిని నమ్ముకుంటే రాజకీయంగా వర్కౌట్ కాదని చంద్రబాబు గ్రహించి, కుప్పానికి మకాం మార్చారు.
ఇదే చెవిరెడ్డి విషయానికి వస్తే వరుసగా రెండుసార్లు చంద్రగిరి నుంచి గెలుపొందారు. మూడోసారి తన అదృష్టాన్ని పరీక్షించు కోనున్నారు. అయితే తన కంటే పెద్ద కుమారుడు మోహిత్రెడ్డినే ఎక్కువ జనానికి దగ్గర చేయాలని చెవిరెడ్డి తపిస్తున్నారు. గడపగడపకూ ఎమ్మెల్యేలు తప్ప, వారసులు వెళ్లకూడదని సీఎం జగన్ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారనే ప్రచారం జరుగుతోంది. కానీ చంద్రగిరిలో చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి ఇవాళ్లి నుంచి ఏడు నెలల పాటు పూర్తిగా జనం మధ్యే గడిపేందుకు సిద్ధమయ్యారు.
ఇదే చంద్రబాబు తనయుడు లోకేశ్ పాదయాత్ర చేస్తానని ప్రచారం తప్ప, ఆచరణకు నోచుకోలేదు. ఇదిగో, అదిగో జనంలోకి వస్తున్నా అని చెప్పడమే తప్ప, ఆ యువ కిషోరం రావడం లేదు. దసరా నుంచి పాదయాత్ర చేస్తారని పెద్ద ఎత్తున టీడీపీ శ్రేణులు ప్రచారం చేశాయి. ఆ తర్వాత తూచ్ అన్నాయి. ఇప్పుడేమో సంక్రాంతి నుంచి లోకేశ్ పాదయాత్ర వుంటుందని టీడీపీ కొత్త ప్రచారం మొదలు పెట్టింది.
లోకేశ్ పాదయాత్రతో లాభం టీడీపీకా? వైసీపీకా? అనే చర్చతోనే వాయిదా పడుతోందని సమాచారం. లాభమో, నష్టమో లోకేశ్ తన నాయకత్వ సమర్థతను నిరూపించుకునేందుకు ఇదే సరైన సమయం. టీడీపీకి రానున్న ఎన్నికలు తాడేపేడో తేల్చుకో వాల్సిన కీలకమైనవనే సంగతి తెలిసిందే.
ఇక చంద్రగిరి విషయానికి వస్తే… ఒకప్పటి చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి కాదబ్బా అనే పెదవి విరుపు మాట వినిపిస్తోంది. రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికై, పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చెవిరెడ్డి సొంత పార్టీ నాయకులకు “చిక్కడు దొరకడు” అనే రీతిలో తప్పించుకుని తిరుగుతున్నారనే విమర్శ వుంది. కరోనా సమయంలో సొంత డబ్బు ఖర్చు పెట్టి చంద్రగిరి నియోజకవర్గ ప్రజలకు నిత్యావసర సరుకులు, ఆనందయ్య మందు పంపిణీ చేయడం ప్రశంసలు కురిపించింది. ఇదే సమయంలో గ్రామస్థాయిలో వైసీపీ నేతలను పట్టించుకోలేదనే విమర్శల నుంచి చెవిరెడ్డి తప్పించుకోలేకపోతున్నారు. ఎన్నికలు సమీపించేకొద్ది వైసీపీ గ్రామస్థాయి నేతల అసంతృప్తి ఎఫెక్ట్ అనుభవంలోకి వస్తుండడంతో చెవిరెడ్డి అప్రమత్తం అయ్యారు.
జగన్ ప్రభుత్వ సంక్షేమ పథకాలతో పాటు చెవిరెడ్డి సొంత పథకాలు కూడా చంద్రగిరిలో పక్కాగా అమలవుతున్నాయి. ఇవన్నీ నాణేనికి ఒక వైపు. నాణేనికి రెండో వైపు చెవిరెడ్డిపై అసంతృప్తి. అది ఏ స్థాయిలో ఉందో అందరికంటే చెవిరెడ్డికే బాగా తెలుసు. పైకి అంతా బాగుందని అనిపిస్తున్నా… ఏదో తేడా కొడుతోందని చెవిరెడ్డి పసిగట్టారు. ఎందుకంటే అతను పక్కా రాజకీయ నాయకుడు. ఎన్ని ఆరోపణలున్నా చెవిరెడ్డి నిత్యం జనానికి ఏదో ఒకటి చేస్తుంటారనే పేరు సొంతం చేసుకున్నారు. చెవిరెడ్డిలో గొప్పదనం ఏంటంటే…నెగెటివిటీని ఊరికే విడిచిపెట్టరు. దానికదే పోతుందని అనుకోరు.
దాన్ని పోగొట్టుకునేందుకు వెంటనే యాక్షన్ మొదలు పెడతారు. బహుశా తన కుమారుడితో పాదయాత్ర చేయిస్తుండడం కూడా అందులో భాగమే అని చంద్రగిరి నియోజకవర్గ ప్రజలు అంటున్నారు. చెవిరెడ్డిని చూసి లోకేశ్ నేర్చుకోవాల్సింది కూడా ఇదే. చెవిరెడ్డి చెబితే వినే కొడుకు మోహిత్ ఉన్నాడు. కానీ లోకేశ్ తన మాట ఎంత మాత్రం వింటున్నాడో చంద్రబాబుకే తెలియాలి. చంద్రగిరి నియోజకవర్గ నీళ్లలో ఏదో మహత్యం వున్నట్టుంది. అక్కడి నాయకులది ప్రత్యేక స్వభావం. చంద్రబాబు, చెవిరెడ్డిని చూస్తే ఈ విషయం అర్థమవుతుంది.