ప్రతి హీరోకు ఫ్యాన్స్ ఉంటారు. సినీ ప్రేక్షకుల్లో చాలామంది ఏదో ఒక హీరోకు అభిమాని అయి ఉంటాడు. అయితే ఈకాలం ఇలా అభిమాని అని సింపుల్ గా చెప్పేస్తే సరిపోదు. ఫ్యాన్స్ లో కూడా రకాలున్నారు. ఉదాహరణకు పవన్ కల్యాణ్ నే తీసుకుందాం. పవన్ కు ఫ్యాన్స్ ఉన్నారు. కల్ట్ ఫ్యాన్స్ ఉన్నారు, సైకో ఫ్యాన్స్ కూడా ఉన్నారు. ఇలాంటి ఫ్యాన్స్ ప్రభాస్, మహేష్ బాబుకు కూడా ఉన్నారు.
తమ అభిమాన హీరో సినిమా థియేటర్లలోకి వస్తే చూసి ఆనందించేవారు ఫ్యాన్స్. సినిమా బాగుంటే ఓకే, బాగాలేకపోతే బాధపడుతూ ఇంటికెళ్లిపోయేవాళ్లు ఈ క్యాటగిరీ. వీళ్లతో ఎవ్వరికీ ఎలాంటి ఇబ్బంది ఉండరు. ఇంకా చెప్పాలంటే ఇలాంటి అభిమానులతో సోషల్ మీడియాలో ఫ్యాన్ వార్స్ కూడా ఉండవు.
సమస్య అంతా నెక్ట్స్ లెవెల్ ఫ్యాన్స్ తోనే వస్తోంది. వీళ్లు తమనుతాము కల్ట్ ఫ్యాన్స్ గా చెప్పుకుంటారు. తమ హీరోకు తామే అభిమానులమని, వేరే ఎవ్వరూ తమంత ప్రేమించలేరనేది వీళ్ల బాధ. ఈ క్రమంలో వీళ్లు పచ్చబొట్లు పొడిపించుకుంటారు. దుస్తులు, హెయిర్ స్టయిల్ మార్చుకుంటారు. వాట్సాప్ డీపీల్లో, సోషల్ మీడియాల్లో తమ హీరోపై ప్రేమను విపరీతంగా కురిపిస్తుంటారు. సోషల్ మీడియాలో జరిగే ఫ్యాన్ వార్స్ లో వీళ్లు కూడా పాల్గొంటారు. కాకపోతే ఒక స్టేజ్ వరకు మాత్రమే.
ఇక మూడో రకం రెబల్ ఫ్యాన్స్.. ఇటు సాధారణ ప్రేక్షకులకు, అటు హీరోలకు ఇక్కడ్నుంచే తలనొప్పులు మొదలవుతాయి. ఇంకా చెప్పాలంటే పోలీసులు కూడా రంగప్రవేశం చేసేది ఇక్కడ్నుంచే. వీళ్లు తమ హీరో కోసం ఏమైనా చేస్తామంటారు. అవసరమైతే మరో హీరో ఫ్యాన్స్ ను కొడతారు. లేదంటే వీళ్లే దెబ్బలు తింటారు. సినిమా రిలీజైన మొదటి రోజు, ఎప్పుడు సినిమా పడుతుందా అని కల్ట్ ఫ్యాన్స్ ఎదురుచూస్తుంటే.. థియేటర్ల బయట వీరంగం ఆడేది ఈ రెబల్ ఫ్యాన్స్. హీరోలపై స్లోగన్స్ స్టార్ట్ చేసింది వీళ్లే. ప్రీ రిలీజ్ ఫంక్షన్లలో హీరో కాళ్లపై పడేది వీళ్లే.
ఇప్పుడు నాలుగో రకం గురించి చెప్పుకుందాం.. వీళ్లు సైకో ఫ్యాన్స్. వీళ్ల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. మరో హీరో ఫ్యాన్స్ ను కొట్టడం మాత్రమే కాదు. అవసరమైతే తమ హీరోనే వీళ్లు తిడతారు. ఓ సినిమా బాగాలేకపోతే అప్పటివరకు సదరు హీరోపై ఉన్న అభిమానం మొత్తం పోతుంది, తిట్ల దండకం వచ్చి చేరుకుంది. చొక్కాలు చిరుగుతాయి, చెప్పులు ఊడుతాయి. దెబ్బలు తగులుతాయి.
వీళ్లు ఇప్పుడు ఏ స్థాయికి చేరుకున్నారంటే, నిర్మాతలు, దర్శకులు, హీరోల్ని కూడా బెదిరించే వరకు వెళ్లారు. అప్ డేట్ ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటామంటారు. రీమేక్ చేస్తే చచ్చిపోతామంటారు. తమ చావుకు హీరో, దర్శకుడు, నిర్మాతే బాధ్యత వహించాలంటూ ఉత్తరాలు రాస్తుంటారు. ఏ దర్శకుడితో సినిమా చేయాలో వీళ్లే చెబుతారు, ఎప్పుడు కొత్త సినిమా స్టార్ట్ చేయాలో వీళ్లే శాసిస్తుంటారు. ఇప్పుడు వీళ్లతోనే అందరికీ కొత్త తలనొప్పులు మొదలవుతున్నాయి.
బాధాకరమైన విషయం ఏంటంటే.. తమకు ఎంతమంది సైకో ఫ్యాన్స్ ఉంటే అంత గొప్ప అనే విధంగా ఫీల్ అవుతున్నారు మన హీరోలు.