మొన్నటికి మొన్న టాప్ హీరో ఎన్టీఆర్ ఓ మాట అన్నారు. సినిమాల తీరు తెన్నులు కాస్త అంతు పట్టకుండా వున్నాయని, వీటిని అధ్యయనం చేయాల్సి వుందనే అర్థం వచ్చేలా మాట్లాడారు. టాలీవుడ్ కూడా ఇప్పుడు అదే ఫీల్ అవుతోంది.
కొత్త సినిమాలను చకచకా ప్లాన్ చేయడానికి ముందు వెనుక ఆడుతోంది. నిర్మాత..డిస్ట్రిబ్యూటర్..ఎగ్జిబిటర్ దిల్ రాజు కూడా ఇప్పట్లో కొత్త స్క్రిప్ట్ లు ఓకె చేయడం, సినిమాలు ప్లాన్ చేయడం వంటివి తాత్కాలికంగా పక్కన పెట్టారట.
దిల్ రాజు నిర్మాణంలో మూడు భారీ సినిమాలు నిర్మాణంలో వున్నాయి. రామ్ చరణ్-శంకర్ సినిమా, విజయ్-వంశీ పైడిపల్లి సినిమా, సమంత-గుణశేఖర్ శాకుంతలం సినిమా లు రెడీ అవుతున్నాయి. వీటిలో రెండు సినిమాలు 2023 సంక్రాంతికి కాస్త అటు ఇటుగా వచ్చేస్తాయి. వీటి మీద మాత్రమే ప్రస్తుతం దృష్టి పెట్టారట. మహా అయితే ముందుగా అనుకున్న తన సోదరుడి కొడుకు సినిమా సెల్ఫిష్ ను స్టార్ట్ చేస్తారు తప్ప మరో సినిమా టచ్ చేసే ఆలోచన లేదని తెలుస్తోంది.
ఇంద్రగంటి చెప్పిన ఫాంటసీ భారీ కథ అన్నది ఎప్పుడో అప్రూవ్ చేసింది అయినా అది కూడా ప్రస్తుతానికి డెవలప్ మెంట్ స్టేజ్ లోనే వుంచారని తెలుస్తోంది.