దృశ్యం.. 50 కోట్ల రూపాయల వసూళ్లను సాధించిన తొలి మలయాళ సినిమా. అంతేగాక తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో రీమేక్ అయిన మలయాళీ సినిమా. రీమేక్ అయిన భాషల్లో భారీ వసూళ్లను అయితే సాధించలేదు కానీ, ప్రశంసలను అయితే పొందింది ఆ సినిమా. మలయాళంలో కమర్షియల్ గా సూపర్ హిట్ అయ్యింది. ఈ క్రమంలో అక్కడ సీక్వెల్ రూపొందుతోంది. ప్రస్తుతానికి షూటింగులకు కేరళలో కూడా అనుమతి లేకపోవడంతో ఆగింది. ఇప్పటికే సీక్వెల్ పార్ట్ కు మోహన్ లాల్ ఓకే చెప్పడం కూడా అయిపోయినట్టుగా తెలుస్తోంది.
ఈ క్రమంలో దృశ్యం ఒరిజినల్ ను, దాని సీక్వెల్ ను రెడీ చేస్తున్న దర్శకుడు జీతూ జోసెఫ్ ఈ సెకెండ్ పార్ట్ గురించి చెబుతూ, సీక్వెల్ అంటే ఏదో టైటిల్ ను క్యాష్ చేసుకోవడానికి చేస్తున్న ప్రయత్నం కాదని అంటున్నాడు.
దృశ్యం సినిమా అక్కడితో ముగిసిందో, అక్కడ నుంచి సీక్వెల్ పార్ట్ కొనసాగుతుందని చెబుతున్నాడు. ఫస్ట్ పార్ట్ సినిమాలో కుర్రాడి మృతదేహాన్ని హీరో ఎక్కడ పూడ్చాడో ప్రేక్షకుడికి క్లూ ఇచ్చి ముగించారు. ఆ కేసు పూర్తిగా క్లోజ్ చేయలేదని కొత్తగా వచ్చిన పోలీసాఫీసర్ హీరోకి చెబుతాడు. ఆ మేరకు విచారణ కొనసాగుతుందని, సెకెండ్ పార్ట్ కథాంశం అదే అని జీతూ జోసెఫ్ ముందే చెప్పేస్తున్నాడు.
విచారణ కొనసాగడంతో ఆ ఫ్యామిలీ ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంది అనేదే దృశ్యం 2 లో ఉంటుందని ఈ దర్శకుడు చెబుతున్నాడు. సీక్వెల్ అంటే పక్కా సీక్వెల్ అని చెబుతున్నాడు. మరి ఈ ఫార్ములాతో ఈ దర్శకుడు ఏ మేరకు మెప్పిస్తాడో!