స్టేట్ ముఖ్యమా.. ఎస్టేట్ ముఖ్యమా.. రియల్ ఎస్టేట్ ముఖ్యమా ఇవి ఏ పాలకుడికైనా ముందున్న ప్రశ్నలే. అభివ్రుధ్ధి చేసిన చోట లోకల్ గా ఉన్న వారు బాగుపడతారు. అయితే అభివ్రుధ్ధి అన్నది భూమి మీదనే చేస్తాం కదాని చెత్త లాజిక్కులను పక్కన పెడితే ధర్మ దేవతలా పాలకుడు ఉండాలి.
ఎక్కడ అభివ్రుధ్ధి చేసినా వాటి ఫలాలు, ఫలితాలు అన్ని ప్రాంతాల జనాలు అనుభవించేలా ఉండాలి. కానీ మనసులో రాగం ఉంచుకుని ద్వేషం మరో వైపు పెంచుకుని చేసే నిర్ణయాలు కాల పరీక్షకు నిలబడవు సరికదా ఘోరంగా విఫలమవుతాయి.
ఇవన్నీ ఎందుకంటే ఇపుడు అమరావతి రాజధాని విషయంలో జరుగుతున్న చర్చలో హాట్ హాట్ గా వస్తున్నవే. ఇక అమరావతి రాజధాని అని చంద్రబాబు ఒక వైపు అంటున్నారు. ఏపీకి ఏకైక రాజధాని ఉండాలని ఆయనతో పాటు తమ్ముళ్ళు పట్టుపడుతున్నారు. మరో వైపు మూడు ప్రాంతాలు అభివ్రుధ్ధి చెందాలని అందుకే మూడు రాజధానుల కాన్సెప్ట్ అని వైసీపీ గట్టిగా అంటోంది.
ఈ తగవు గత ఆరేడు నెలలుగా సాగుతూనే ఉంది. దీని మీద తాజాగా వైసీపీ మంత్రులు బాబుకు పంచులే వేస్తున్నారు. స్టేట్ ముఖ్యమా, రియల్ ఎస్టేట్ ముఖ్యమా చంద్రబాబూ అంటూ సూటిగానే మంత్రి ధర్మాన ప్రసాదరావు అడుగుతున్నారు. రియల్ ఎస్టేట్ కోసం రాజధానులు పుట్టకూడదు అని కూడా హితవు చెబుతున్నారు. అమరావతి పేరిట మొత్తమంతా దోచిపెడితే వేర్పాటువాద ఉద్యమాలు వస్తాయని మరో మంత్రి అవంతి శ్రీనివాస్ అంటున్నారు.
రియల్ ఏస్టేట్ వ్యాపారం కోసమని గుప్పెడు వ్యక్తులను పెట్టుకుని అమరావతి ఉద్యమంగా చూపించడం అన్యాయమని వైసీపీ ఎమ్మెల్యే గుడివాడ అమరనాధ్ అంటున్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా పనిచేశారని, అన్ని ప్రాంతాలను సమానంగా చూడకుండా ఇంకా అమరావతి అంటే విశాఖ జనం సహించరని కూడా గట్టిగానే హెచ్చరిస్తున్నారు. మొత్తానికి స్టేటా, రియల్ ఎస్టేటా తేల్చుకో బాబూ అంటున్నారు వైసీపీ నేతలు.