దర్శకుడు శంకర్ తన పెద్ద కూతురుకు పెళ్లి చేయబోతున్నాడంటూ కొన్ని రోజులుగా కోలీవుడ్ లో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అవి నిజమని ఈరోజు అతడి రెండో కూతురు, హీరోయిన్ అదితి శంకర్ నిర్థారించింది. తన అక్క ఐశ్వర్య శంకర్ కు నిశ్చితార్థం జరిగినట్టు తెలిపింది. దీనికి సంబంధించి కొన్ని ఫొటోల్ని కూడా షేర్ చేసింది.
శంకర్ కు ఇద్దరు కుమార్తెలు, ఒక కొడుకు. పెద్ద కుమార్తె ఐశ్వర్యకు 2021లోనే పెళ్లి చేశాడు. క్రికెటర్ రోహిత్ దామోదరన్ తో మహాబలిపురంలో ఐశ్వర్య పెళ్లి జరిగింది. అయితే పెళ్లయిన నెల రోజులకే పోక్సో కేసులో ఇరుక్కున్నాడు రోహిత్. తన అకాడమీలో మహిళా క్రికెటర్లను వేధించాడనే ఆరోపణలు అతడిపై వచ్చాయి.
దీంతో పెళ్లయిన 6 నెలలకే అతడి నుంచి విడిపోయి తండ్రి శంకర్ దగ్గరకు వచ్చేసింది ఐశ్వర్య. ఆ తర్వాత అధికారికంగా విడాకులు కూడా తీసుకుంది. ఇప్పుడామెకు రెండో పెళ్లి చేస్తున్నాడు దర్శకుడు శంకర్.
తన దగ్గర అసిస్టెంట్ డైరక్టర్ గా పనిచేస్తున్న తరుణ్ కార్తికేయన్ తో సంబంధం కలుపుకుంటున్నాడు. వీళ్లిద్దరి ఎంగేజ్ మెంట్ తాజాగా పూర్తయింది. దీనికి సంబంధించిన ఫొటోల్ని సోషల్ మీడియాలో షేర్ చేసింది శంకర్ రెండో కూతురు, హీరోయిన్ అదితి శంకర్.
ప్రస్తుతం ఇండియన్-2, గేమ్ ఛేంజర్ సినిమాలపై వర్క్ చేస్తున్నాడు శంకర్. ఈ రెండు సినిమాలు ఓ కొలిక్కి వచ్చిన వెంటనే కూతురికి పెళ్లి చేసే పనుల్లో బిజీ అయ్యే అవకాశం ఉంది.