ఉన్నది ఉన్నట్టు మాట్లాడ్డం తేజ స్టయిల్. హీరో ఎవరైనా, సందర్భం ఏదైనా తన మనసులో ఉన్నది కక్కేస్తుంటాడు ఈ దర్శకుడు. ఈసారి కూడా అదే పనిచేశాడు. తెలుగు, తమిళ ఇండస్ట్రీలపై హీరోలపై తనదైన శైలిలో పంచ్ లు వేశాడు. మరీ ముఖ్యంగా కమల్ హాసన్ ను మహానటుడు అంటే ఈయన ఒప్పుకోవట్లేదు.
“చాలామంది కమల్ హాసన్ ను మహానటుడు అంటారు. నేను ఒప్పుకోను. అది నా వ్యక్తిగత అభిప్రాయం. దశావతారంలో ఆయన 10 గెటప్స్ వేశాడు. బాగా చేశాడని అంతా అనుకున్నారు. కానీ ఆ 10 గెటప్స్ లో కమల్ హాసనే కనిపించాడు. అదే రోబో సినిమాలో రజనీకాంత్ ను చూస్తే, ఓ సీన్ లో సైంటిస్ట్ రజనీని చంపాలని రోబో ప్రయత్నిస్తుంటుంది. రోబోలా మారువేషం వేసుకున్న సైంటిస్ట్ ను గుర్తుపట్టేస్తుంది. అక్కడ మనకు రోబోలో రజనీకాంత్ కనిపించడు. ఆ పాత్ర కనిపిస్తుంది. అది నటుడి గొప్పదనం. పాత్రలో కమల్ కనిపించకూడదు, క్యారెక్టర్ కనిపించాలి.”
ఇలా తనదైన శైలిలో కమల్-రజనీ నటన మధ్య తేడాల్ని విశ్లేషించాడు తేజ. నటన అనేది వారసత్వంతో రాదని, నిబద్ధతతో వస్తుందని అంటున్న తేజ.. ఎంతో కష్టపడితే తప్ప స్టార్స్ కాలేరని చెప్పుకొచ్చాడు. ఫ్లూక్ లో కొందరు స్టార్స్ అయిపోయినా ఎక్కువ రోజులు నిలబడరని కామెంట్ చేశాడు.
“స్టార్స్ ఊరికే అవ్వరు. మన ఆత్మ, ఊపిరి అంతా నటనలో పెట్టేస్తేనే స్టార్స్ అవుతారు. ఊరికే ఎవ్వరూ అవ్వరు, కష్టపడితేనే అవుతారు. కొందరుంటారు. ఓ నలుగురు ఐదుగురు ఫ్లూక్ లో స్టార్స్ అయ్యారు. కానీ ఎక్కువ రోజులు నిలబడరు.”
తన దృష్టిలో కారవాన్ లో ఉండేవాడు హీరోనే కాదంటాడు తేజ. ఇతర నటుల యాక్టింగ్ ను కూడా గమనిస్తూ సెట్స్ లో ఉండేవాడే నిజమైన స్టార్ అవుతాడని… అమీర్, అమితాబ్, చిరంజీవి లాంటి నటులు అదే పనిచేశారని తన అనుభవాల్ని గుర్తుచేసుకున్నాడు.