ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ హీరోగా కొనసాగుతున్నాడు పవన్ కల్యాణ్. అత్యథిక పారితోషికం తీసుకుంటున్న హీరోల్లో ఒకడిగా గుర్తింపు పొందాడు. తన రెండు దశాబ్దాల సినీ కెరీర్ లో హీరోగా, దర్శకుడిగా, స్క్రీన్ రైటర్ గా, నిర్మాతగా ఎన్నో పాత్రలు పోషించాడు.
రాజకీయాల్లో కూడా కొనసాగుతున్నాడు. తన ఛరిష్మాతో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్న పవన్ కల్యాణ్.. తన తొలి సినిమాకు ఎంత పారితోషికం అందుకున్నాడో తెలుసా..?
1996లో వచ్చిన అక్కడ అమ్మాయి-ఇక్కడ అబ్బాయి సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు పవన్ కల్యాణ్. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా కోసం పవన్ కల్యాణ్ కు నెలకు 5వేల రూపాయలు చొప్పున పారితోషికంగా ఇచ్చారట నిర్మాత అల్లు అరవింద్. కొన్నేళ్ల కిందట ఓ జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్వయంగా పవన్ కల్యాణ్ చెప్పిన మేటర్ ఇది.
ఇలా నెలకు 5వేల రూపాయల పారితోషికంతో హీరోగా మారిన పవన్ కల్యాణ్, ప్రస్తుతం ఒక్కో సినిమాకు 50 కోట్ల రూపాయలు రెమ్యూనరేషన్ తీసుకునే స్థాయికి ఎదిగాడు. ఈ రేటు ఇక్కడితో ఆగేలా లేదు. త్వరలోనే సురేందర్ రెడ్డి దర్శకత్వంలో సినిమా చేయబోతున్నాడు పవన్. ఆ సినిమాకు ఇంతకంటే కాస్త ఎక్కువ మొత్తమే పారితోషికంగా అందుకుంటున్నాడట ఈ హీరో.
అజ్ఞాతవాసి తర్వాత సినిమాలకు గ్యాప్ ఇచ్చాడు పవన్ కల్యాణ్. రాజకీయాల్లోకి వచ్చాడు. తిరిగి వకీల్ సాబ్ సినిమాతో సిల్వర్ స్క్రీన్ పైకి రీఎంట్రీ ఇచ్చాడు. అప్పట్నుంచి వరుసపెట్టి సినిమాలు చేస్తూనే ఉన్నాడు.
ప్రస్తుతం భీమ్లా నాయక్, హరిహర వీరమల్లు సినిమాలు పూర్తిచేసే పనిలో బిజీగా ఉన్నాడు. ఈ రెండు సినిమాల తర్వాత హరీశ్ శంకర్, సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మరో 2 సినిమాలు చేయబోతున్నాడు.