నటుడిగానే కాకుండా దర్శకుడిగా కూడా తన ప్రత్యేకతను చాటుకోవడానికి వివిధ ప్రయత్నాలను చేస్తూ వస్తున్నాడు ప్రకాష్ రాజ్. ఆ మధ్య 'మన ఊరి రామాయణం' సినిమాతో తెలుగు, కన్నడ ప్రేక్షకులను పలకరించారీయన. మలయాళీ సినిమా 'షట్టర్' కు రీమేక్ అయిన మన ఊరి రామాయణం ప్రకాష్ రాజ్ లోనూ ఒక మంచి దర్శకుడున్నాడనే విషయాన్ని చాటుతుంది. ఒరిజినల్ తో పోలిస్తే సినిమాను క్రిస్పీగా తయారుచేయడంలో ప్రకాష్ రాజ్ పటిమ కనిపిస్తుంది.
ఇక ఆ తర్వాత మరో కన్నడ సినిమాకు తెలుగు, తమిళ రీమేక్ లను అనౌన్స్ చేశాడు ఈ నటుడు. గోధీబన్న సాధారణ మైకట్టు అనే కన్నడ సినిమాను తెలుగు, తమిళ భాషల్లో రీమేక్ చేయబోతున్నట్టుగా ప్రకటించాడు. అయితే ఎందుకో అది కార్యరూపం దాల్చినట్టుగా లేదు.
ఆ సంగతలా ఉంటే.. ఇప్పుడు ఒక డాక్యుమెంటరీ సీరిస్ కు రంగం సిద్ధం చేస్తున్నారట ప్రకాష్ రాజ్. ఇది కర్ణాటకలోని అడవుల విషయంలో. అక్కడి అడవుల్లోని జంతుజాలం గురించి, వృక్షజాతుల గురించి ఈ సీరిస్ సాగుతుందని ప్రకటించారు. దీనికి ప్రకాష్ రాజ్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. ఈ విషయాన్ని ప్రకటిస్తూ ఆయన ట్వీట్ చేయగా, నటుడు మహేశ్ బాబు ఈ విషయంపై స్పందించాడు. ఆయన నెరేషన్ కోసం ఎదురుచూస్తున్నట్టుగా మహేశ్ పేర్కొన్నాడు. జూన్ మొదటి వారం నుంచి ఈ సీరిస్ ప్రసారం కానుందట.