అప్పుడు భోళా-జైలర్.. ఇప్పుడు భగవంత్-లియో?

పండగ సీజన్ లో స్ట్రయిట్ సినిమాలకే థియేటర్లు సరిపోవు. అలాంటిది చాప కింద నీరులా డబ్బింగ్ సినిమాలు కూడా వచ్చేస్తున్నాయి. ఇలా వచ్చిన సినిమాల్లో చాలామటుకు పెద్దగా ప్రభావం చూపించవు. కాకపోతే ఈమధ్య మాత్రం…

పండగ సీజన్ లో స్ట్రయిట్ సినిమాలకే థియేటర్లు సరిపోవు. అలాంటిది చాప కింద నీరులా డబ్బింగ్ సినిమాలు కూడా వచ్చేస్తున్నాయి. ఇలా వచ్చిన సినిమాల్లో చాలామటుకు పెద్దగా ప్రభావం చూపించవు. కాకపోతే ఈమధ్య మాత్రం డబ్బింగ్ సినిమాలు ఊహించని దెబ్బ కొడుతున్నాయి.

దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ జైలర్ సినిమా. భోళాశంకర్ తో పాటు వచ్చింది జైలర్. రజనీకాంత్ గత సినిమాలతో పోల్చి చూసుకుంటే, జైలర్ సినిమా చిరంజీవి మూవీకి ఏమాత్రం పోటీకాదని అంతా భావించారు. అదే ఓవర్ కాన్ఫిడెన్స్ తో సినిమాను దించారు. అయితే జైలర్ ఊహించని దెబ్బ కొట్టింది.

చిరంజీవి సినిమాకు ఫ్లాప్ టాక్ రావడం, అదే టైమ్ లో జైలర్ సినిమాకు బ్లాక్ బస్టర్ టాక్ రావడంతో.. రజనీకాంత్ కు ఎదురులేకుండా పోయింది. రజనీ మూవీ రాకుండా ఉండుంటే, చిరు సినిమా కొంతలోకొంతైనా కోలుకుని ఉండేదంటూ అప్పట్లో చర్చ జరిగిందంటే జైలర్ ఇంపాక్ట్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.

కట్ చేస్తే, ఇప్పుడు బాలకృష్ణ వంతు వచ్చింది. ఈసారి భగవంత్ కేసరికి లియో సినిమా పోటీగా నిలిచింది. ఈ మూవీని కూడా తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. ఎందుకంటే, అక్కడున్నది దర్శకుడు లోకేష్ కనగరాజ్. అతడికి తెలుగులో సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

దీనికితోడు, ఈసారి తెలుగులో లియోకు 'సితార' అండ ఉంది. ఓ స్ట్రయిట్ సినిమాకు ఏమాత్రం తీసిపోని విధంగా థియేటర్లు దక్కాయి. సో.. భగవంత్ కేసరికి అటు టైగర్ నాగేశ్వరరావుతో పాటు, ఇటు డబ్బింగ్ మూవీ లియో నుంచి కూడా పోటీ తప్పలేదు.

తెలుగుతెరపైకి డబ్బింగ్ చిత్రాల జోరును ఆపలేం. ఇది సహజంగా జరిగే ప్రక్రియ. కాకపోతే కనీసం దసరా, సంక్రాంతి లాంటి పండగల వేళల్లో డబ్బింగ్ సినిమాల్ని కాస్త నియంత్రించగలిగితే, తెలుగు సినిమా మరింత కళకళలాడుతుంది. భగవంత్ కేసరిపై లియో ప్రభావం ఎంతనేది మరికొన్ని గంటల్లో తేలిపోతుంది.