ఇది గాసిప్ కాదు. పైగా ఈ అనుమానం వ్యక్తం చేస్తోంది ఎవరో మూడో వ్యక్తి కూడా కాదు. స్వయంగా ఆర్ఆర్ఆర్ సినిమా దర్శకుడు, అన్నీ తానై నడిపిస్తున్న రాజమౌళి ఈ అనుమానం వ్యక్తంచేశాడు. అవును.. ఎన్టీఆర్ పుట్టినరోజుకు ఆర్ఆర్ఆర్ నుంచి అతడి టీజర్ వచ్చేది అనుమానమే అంటున్నాడు జక్కన్న.
“చరణ్ బర్త్ డే టీజర్ కు తారక్ వాయిస్ ఇచ్చాడు. లాక్ డౌన్ కంటే ముందే తెలుగు వాయిస్ ఓవర్ అయిపోయింది. మిగతా భాషల వాయిస్ ఓవర్ మాత్రం ఇంట్లో నుంచే ఆన్ లైన్ లో చేశాం. చరణ్ టీజర్ కు ఈ వాయిస్ ఓవర్ తప్ప మిగతాదంతా రెడీగా ఉంది. కాబట్టి పని సాఫీగా అయిపోయింది. కానీ తారక్ టీజర్ కు వచ్చేసరికి మాత్రం మేం లాక్ డౌన్ లో పడిపోయాం. మా దగ్గర మెటీరియల్ కూడా లేదు. అది కావాలంటే ఆఫీస్ కు వెళ్లాలి. అక్కడి సర్వర్ లో ఉంది.”
ఇక్కడే మరో బాంబ్ కూడా పేల్చాడు రాజమౌళి. ఎన్టీఆర్ టీజర్ రిలీజ్ చేయాలంటే కేవలం ఎడిటింగ్, గ్రాఫిక్ వర్క్ మాత్రమే పూర్తయితే చాలదు. టీజర్ కు సంబంధించి కొంత షూటింగ్ వర్క్ కూడా పెండింగ్ ఉందనే విషయాన్ని బయటపెట్టాడు.
“తారక్ టీజర్ కు సంబంధించి కొంత షూటింగ్ కూడా ఉంది. అది ఎప్పుడు చేస్తామో, చేయగలమో లేదో కూడా తెలీదు. చరణ్ బర్త్ డేకు టీజర్ రిలీజ్ చేశాం కాబట్టి తారక్ బర్త్ డేకు కూడా టీజర్ రిలీజ్ చేయాల్సిందే. ప్లాన్ అయితే రెడీగా ఉంది కానీ ఎగ్జిక్యూట్ చేయలేకపోతున్నాం. ప్రభుత్వం నుంచి అనుమతి వస్తే తప్ప ఆ పని చేయలేం.”
సో.. ఇప్పుడు తారక్ టీజర్ రావాలంటే అది ప్రభుత్వం చేతిలో ఉంది. షూటింగ్స్ కు ప్రభుత్వం పాక్షికంగానైనా అనుమతి ఇస్తే.. ఎన్టీఆర్ బర్త్ డేకు ఆర్ఆర్ఆర్ నుంచి అతడి టీజర్ వస్తుంది. లేకపోతే కష్టమే.