అసలు ఒరిజినల్ దృశ్యం-2 నే థియేటర్లలో విడుదల కాలేదు. అది డైరెక్టుగా అమెజాన్ లో విడుదల అయ్యింది, ఒకేసారి అన్ని భాషల ప్రేక్షకులకూ అందుబాటులోకి వచ్చింది. గమనించాల్సిన అంశం ఏమిటంటే.. అప్పటికే దృశ్యం సినిమా తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో రీమేక్ అయ్యి అంతటా ఫర్వాలేదనిపించుకుంది.
భారీ కలెక్షన్లను పొందిన రీమేక్ లు కాదు కానీ, బాగా ఆసక్తిని అయితే కలిగించాయి. దీంతో మలయాళీలు దృశ్యం-2 అనగానే మిగిలిన భాషల వాళ్లకూ ఆసక్తి కలిగింది. ఆ సినిమా డైరెక్టుగా అమెజాన్ లో అందుబాటులోకి రావడంతో ఆసక్తి ఉన్న వాళ్లంతా ఆ సినిమాను వీక్షించారు.
అర్థవంతమైన సీక్వెల్ అంటూ ప్రశంసలు వచ్చాయి. ఇక తెలుగు వాళ్లు ఏ మాత్రం లేట్ లేకుండా దృశ్యం-2 రీమేక్ తలపెట్టారు. రీమేక్ లకు సదా సిద్ధంగా ఉండే విక్టరీ వెంకటేష్ రెండో పార్ట్ ను కూడా రీమేక్ చేశారు. దృశ్యం సినిమాకు పని చేసిన వారే ఈ సీక్వెల్ పార్ట్ కు దాదాపు పని చేశారు. దర్శకత్వం మాత్రం మలయాళంలో ఒరిజినల్ వెర్షన్ దర్శకుడు జీతూ జోసెఫ్ బాధ్యతలు తీసుకున్నాడు.
దీంతో సెట్టింగ్ కూడా కేరళకు మారింది. పూర్తిగా దృశ్యం-2 ఒరిజినల్ సెట్టింగ్స్ లోనే ఈ సినిమాను చిత్రీకరించి ఉండే అవకాశం ఉంది. దర్శకుడు అతడే, లొకేషన్లు అవే! నటీనటుల్లో వెంకటేష్, ఆయన పెద్ద కూతురు వేరే. మీనా, చిన్న కూతురు కామన్! ఇది వరకూ కొన్ని డబ్బింగ్ సినిమాలకు లోకల్ నటులతో కొన్ని సీన్లను తీసి అతికించేవారు. ఆ తరహాలో దృశ్యం-2లో తెలుగుదనం ఉట్టిపడనుంది!
ఒకవేళ ఈ సినిమా అయినా థియేటర్లలో విడుదల అయి ఉంటే, అదో మరో రకమైన అనుభవంగా మిగిలేది. తీరా ఇప్పుడు ఆ సినిమా కూడా ఓటీటీలోనే విడుదల అవుతుందంటున్నారు. అమెజాన్లో ఉండే చాలా సినిమాలకు వేర్వేరు భాషల డబ్బింగులుంటాయి. అయితే దృశ్యం-2 కు మాత్రం రీమేక్ వెర్షనే అందుబాటులోకి వస్తోంది! డబ్బింగ్ తో పోయే పనికి, రీమేక్ చేశారేమో! అయితే మార్కెట్ పరంగా మాత్రం అందరికీ ఇది లాభసాటి బేరమే అవుతోందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి.
మరో విశేషం ఏమిటంటే.. దృశ్యం-2 సినిమాను తమిళులు కూడా రీమేక్ చేయనున్నారట. కమల్ హాసన్ ఆ పని మీద దృష్టి పెట్టారట. మరి తమిళ వెర్షన్ అయినా థియేటర్లకు వస్తుందో, లేక మరో వెర్షన్ తీసి దాన్ని కూడా ఓటీటీలోనే వదులుతారో!