ఒక టైటిల్ లేదా ప్రాంచైజ్ లో ఇన్ని సార్లు రీమేక్, అది కూడా రీమేక్ అయిన ప్రతి సారీ హిట్ ను నమోదు చేయడం ఒకే ఒక్క దృశ్యం సీరిస్, రీమేక్ లకే సాధ్యం అవుతున్నట్టుగా ఉంది. 2013లో దృశ్యం మలయాళీ వెర్షన్ వచ్చి ఆ భాషేతరులను కూడా ఆకట్టుకుంది. దీంతో వివిధ భాషల్లో ఆ సినిమా రీమేక్ ప్రయత్నాలు మొదలయ్యాయి. కన్నడీగులు దృశ్య అంటూ రీమేక్ చేసి హిట్ కొట్టారు. ఆ తర్వాత తెలుగు, తమిళ, హిందీ భాషల్లో కూడా మలయాళీ దృశ్యం సినిమా రీమేక్ అయ్యింది.
ఆ తర్వాత మలయాళీలు దృశ్యం-2తో వచ్చారు. లాక్ డౌన్ సమయంలో ఆ సినిమా సంచలన విజయాన్ని అందుకుంది. ఆ వెంటనే తెలుగు, కన్నడల్లో దృశ్యం-2 రీమేక్ అయ్యింది. ఈ భాషల్లో కూడా సానుకూల ఫలితాలను అందుకుంది. ఇక తాజాగా దృశ్యం-2 హిందీ వెర్షన్ కూడా భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. ఈ సినిమా ఇప్పటి వరకూ 150 కోట్ల రూపాయల పై స్థాయి వసూళ్లను సాధించిందిన బాక్సాఫీస్ ఫలితాలు చెబుతున్నాయి.
ఇది సులువుగా రెండు వందల కోట్ల రూపాయల వసూళ్ల మార్కును కూడా అధిగమిస్తుందనే అంచనాలున్నాయి. యాజిటీజ్ గా మలయాళం నుంచి దించేశారనే రివ్యూలే వచ్చినా అజయ్ దేవగణ్ కు దృశ్యం-2 రూపంలో హిట్ దక్కుతోంది. ఈ సినిమాను దాదాపు యాభై కోట్ల రూపాయల బడ్జెట్ తోనే రూపొందించారని, వసూళ్లు భారీ స్థాయిలో ఉండటంతో ఈ ఏడాదిలో చెప్పుకోదగిన బాలీవుడ్ హిట్ సినిమాగా నిలవడం ఖాయమనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
ఇలా దృశ్యం-2 మరో భాషలో కూడా కమర్షియల్ విజయాన్ని నమోదు చేసింది. స్థూలంగా దృశ్యం నాలుగు భాషల్లో, దృశ్యం-2 మూడు భాషల్లో.. మొత్తంగా ఏడు ప్రాజెక్టులుగా ఈ కాన్సెప్ట్ విజయాన్ని నమోదు చేసింది. అలాగే వేరే భారతీయ భాషల్లో కూడా ఈ సినిమా రీమేక్ అయ్యింది.
ఇక దృశ్యం-2 తమిళ రీమేక్ పట్ల దృష్టి పెట్టాడట ఒరిజినల్ దర్శకుడు జీతూ జోసెఫ్. కమల్ హాసన్ దృశ్యం సినిమాను రీమేక్ చేశాడు. సరిగ్గా కేటాయిస్తే 50 వర్కింగ్ డేస్ లోనే ఈ రీమేక్ ను తీసేయగలడు సదరు దర్శకుడు. కాబట్టి.. తమిళంలో రీమేక్ కు కూడా అవకాశాలున్నట్టే. అలాగే మలయాళంలో దృశ్యం-3 అంటూ అనౌన్స్ చేశారు ఇప్పటికే! మరి అదే స్థాయి హిట్ అవుతుందో, ఎన్ని భాషల్లో రీమేక్ అవుతుందో!