గుజరాత్ రాజకీయ చిత్రం చాలా క్లియర్ గా ఉంటుంది. సీట్లు నెగ్గే విషయంలో పార్టీల మధ్యన ప్రధాన వ్యత్యాసం అర్బన్, రూరల్ కేటగిరిలో మాత్రమే ఉంది! అర్బన్ లో భారతీయ జనతా పార్టీ స్వీప్ చేయడం, గ్రామీణ ప్రాంతాల్లో కాంగ్రెస్ ఆధిపత్యం ఉంది. ఎంతలా అంటే..గత ఎన్నికల నంబర్లే తీసుకుంటే.. అర్బన్ నియోజకవర్గాలైన 42 నియోజకవర్గాల్లో బీజేపీ 36 నెగ్గింది. కేవలం ఆరు అర్బన్ నియోజకవర్గాలను మాత్రమే కాంగ్రెస్ నెగ్గింది.
అదే రూరల్ నియోజకవర్గాల విషయానికి వస్తే.. 140 ఉన్నాయి. వీటిల్లో కాంగ్రెస్ పార్టీ ఏకంగా 71 నెగ్గింది. గ్రామీణ నియోజకవర్గాల్లో నెగ్గిన 71, అర్బన్ లో నెగ్గిన ఆరు సీట్లతో కలిపి కాంగ్రెస్ కు గత ఎన్నికల్లో 77 సీట్లు వచ్చాయి. గ్రామీణ ప్రాంతాల్లో కాంగ్రెస్ ఇలా గట్టి పోటీ ఇవ్వడమే కాదు, మెజారిటీ సీట్లను నెగ్గింది. కేవలం గత ఎన్నికల్లోనే కాదు.. 2012 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా దాదాపు అదే పరిస్థితి. గ్రామీణ ప్రాంతాలను కలిగిన నియోజకవర్గాల్లో 50 శాతం సీట్లను కాంగ్రెస్ గెలిచింది. అర్బన్ లో వచ్చే ఆధిక్యాలు, అధిక సీట్లతో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగింది.
మోడీ, అమిత్ షా ల సొంత రాష్ట్రంలో ఇలా భారతీయ జనతా పార్టీ ప్రధానంగా నగర ఓటర్ల మద్దతుతోనే ప్రభుత్వాలను వరసగా ఏర్పాటు చేయగలుగుతోంది. మరి ఇప్పుడు బీజేపీని ఆమ్ ఆద్మీ పార్టీ టెన్షన్ పెడుతోంది.
ఆప్ ప్రధానంగా నగర ఓటర్ల పార్టీ. ఇప్పటి వరకూ ఆప్ ప్రస్థానం అంతా అర్బన్, అక్షరాస్యులైన ఓటర్ల మద్దతుతోనే సాగుతూ ఉంది. దేశ రాజధాని ప్రాంతంలోనే ఆప్ ప్రథమంగా జెండా పాతింది. ఆ తర్వాత కూడా ఆప్ విస్తరణ ప్రధానంగా నగరాలనూ, నగర ఓటర్లను లక్ష్యంగానే చేసుకుని సాగుతూ ఉంది. మరి ఇప్పుడు గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలపై ఆప్ గట్టిగా కసరత్తు సాగిస్తూ ఉంది.
ప్రధాని మోడీ, బీజేపీని లక్ష్యంగా చేసుకుని ఇక్కడ ఆప్ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ గట్టిగానే పోరాడుతున్నారు. మరి అర్బన్ ఓటర్ల పార్టీ అనే ఇమేజ్ ను కలిగి ఉన్న ఆప్.. గుజరాత్ లోని పట్టణ ప్రజానీకాన్ని అదే స్థాయిలో ఆకట్టుకుంటే మాత్రం కమలం పార్టీకి చుక్కలు కనిపించే అవకాశం ఉంది. పట్టణాల్లో ఆప్ భారీగా సీట్లను గెలవడం మాట అటుంచి, ఓట్లను భారీ ఎత్తున చీల్చినా బీజేపీకి చిక్కుల తప్పకపోవచ్చు.
ఇప్పటికే బీజేపీని ఎండగడుతూ కేజ్రీవాల్ తన పార్టీని గుజరాతీలకు చేరువ చేసేందుకు సర్వశక్తులూ ఒడ్డుతున్నాడు. అయితే బీజేపీ మాత్రం మోడీ పేరే కాపాడుతుందనే లెక్కలతో ఉంది. మరి గుజరాత్ లో అర్బన్ ఓటర్ల అండతోనే ప్రధానంగా పరువు నిలబెట్టుకుంటున్న బీజేపీకి ఆప్ షాక్ ఇస్తే.. ఇది ఆ పార్టీ నమోదు చేసే మరో పెద్ద సంచలనం అవుతుంది.