అక్టోబర్ బాక్సాఫీస్: డబ్బింగ్ సినిమాలదే హవా

డబ్బింగ్ తో కలిపి అక్టోబర్ లో 28 సినిమాలు రిలీజ్ అయ్యాయి. స్ట్రయిట్ సినిమాల కంటే, డబ్బింగ్ సినిమాలే బాగా హిట్టయ్యాయి. అవును.. ఈ నెలలో హిట్ అయిన సినిమాలు రెండూ డబ్బింగ్ సినిమాలే.…

డబ్బింగ్ తో కలిపి అక్టోబర్ లో 28 సినిమాలు రిలీజ్ అయ్యాయి. స్ట్రయిట్ సినిమాల కంటే, డబ్బింగ్ సినిమాలే బాగా హిట్టయ్యాయి. అవును.. ఈ నెలలో హిట్ అయిన సినిమాలు రెండూ డబ్బింగ్ సినిమాలే.

దసరా స్పెషల్ గా అక్టోబర్ మొదటి వారంలో గాడ్ ఫాదర్, ది ఘోస్ట్, స్వాతిముత్యం సినిమాలు రిలీజ్ అయ్యాయి. వీటిలో నాగార్జున నటించిన ది ఘోస్ట్ సినిమా మొదటిరోజే తేలిపోయింది. రీమేక్ గా వచ్చిన గాడ్ ఫాదర్ సినిమాకు ప్రారంభంలో పాజిటివ్ టాక్ వచ్చింది. రివ్యూలు, రేటింగ్స్ కూడా మంచిగా వచ్చాయి. కానీ రోజులు గడిచేకొద్దీ ఈ సినిమా కూడా పలచబడి పోయింది. 

ఇక రెండు పెద్ద సినిమాల మధ్య చిన్న సినిమాగా వచ్చిన స్వాతిముత్యంది మరో వ్యథ. ఈ సినిమా బాగాలేదని ఎవ్వరూ అనలేదు, అలా అని థియేటర్లకు వెళ్లి ఎవ్వరూ చూడలేదు. అలా పబ్లిసిటీలో మాత్రమే కనిపించిన 'సక్సెస్'.. వసూళ్లలో కనిపించలేదు. దీంతో దసరాకు థియేటర్లలో రిలీజైన ఈ సినిమా, దీపావళికి ఓటీటీలోకి వచ్చేసింది.

అక్టోబర్ రెండో వారంలో ఏకంగా 10 సినిమాలు రిలీజయ్యాయి. వీటిలో హిట్ అయిన సినిమా కాంతార మాత్రమే. కన్నడ డబ్బింగ్ గా, అక్కడ ఆల్రెడీ హిట్టయిన సినిమాగా, భారీ హైప్ తో తెలుగు తెరపైకొచ్చిన కాంతార, ఆ హైప్ ను నిలబెట్టుకుంది. టాలీవుడ్ లో కూడా కమర్షియల్ గా హిట్టయింది. దీంతో పాటు వచ్చిన మిగతా సినిమాలన్నీ వేటికవే ఫ్లాప్ అయ్యాయి. వీటిలో రకుల్ సోదరుడు నటించిన నిన్నే పెళ్లాడతా సినిమాతో పాటు.. అడవి, రెబల్ లాంటి రీ-రిలీజెస్ కూడా ఉన్నాయి.

మూడో వారంలో కూడా డబ్బింగ్ సినిమా హవానే కొనసాగింది. దీపావళి కానుకగా ఓరి దేవుడా, జిన్నా, ప్రిన్స్, సర్దార్ మూవీస్ రిలీజ్ అయితే, కార్తి నటించిన సర్దార్ సినిమాకే ఆడియన్స్ ఓటేశారు. విశ్వక్ నటించిన రీమేక్ మూవీ ఓరి దేవుడా ఓ మోస్తరుగా ఆడుతోంది. ప్రిన్స్, జిన్నా సినిమాలు బాక్సాఫీస్ పై ఏమంత ప్రభావం చూపలేకపోయాయి.

ఇక చివరి వారంలో రుద్రవీణ, తీహార్ కాలేజ్, అనుకోని ప్రయాణం లాంటి సినిమాలొచ్చినా ఏదీ క్లిక్ అవ్వలేదు. ఇలా అక్టోబర్ నెలలో కాంతార, సర్దార్ మాత్రమే సాలిడ్ హిట్స్ అనిపించుకున్నాయి.