పబ్లిక్ లో వుంటే ఏమైనా అంటాం అంటాడు మహా కవి శ్రీశ్రీ. ఏమైనా అనడం అనేది పెద్ద మాట. కానీ సెలబ్రిటీలు అనే స్టేటస్ అందుకున్నాక రాళ్లూ..పూలూ రెండూ వుంటాయి. సెల్ఫీలు అడినపుడు సంబరపడి, సెటైర్ వేస్తే బాధపడిపోకూడదు. రెండూ తీసుకోకతప్పదు. అందుకే పెద్ద సెలబ్రిటీలు పబ్లిక్ లైఫ్ కు వీలయినంత దూరంగా వుంటారు. అందువల్ల ఏతావాతా చెప్పొచ్చేది ఏమిటంటే ఈ వారం విడుదలయిన ఈగిల్ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలా ఫేర్ చేస్తోంది అన్నది చూడాల్సిన అవసరం వుంది. ఎందుకంటే వడ్డీలు, ప్రింట్, పబ్లిసిటీతో కలిపి సుమారు 75కోట్ల మేరకు ఖర్చయిన సినిమా అనే వార్తలు వున్నాయి.
ఈగిల్ సినిమాను ఎక్కడ విక్రయించలేదు. స్వంతంగా విడుదల చేసుకున్నారు. అయితే డిస్ట్రిబ్యూటర్ల దగ్గర అడ్వాన్స్ లు తీసుకున్నారు. తక్కువ పడితే రాజాసాబ్ సినిమా టైమ్ లో సెటిల్ చేసుకుంటామన్నారు అన్నది బయ్యర్ల వర్గాల సమాచారం. ఇలా తీసుకున్న అడ్వాన్స్ లు ఇరవై నుంచి పాతిక కోట్ల వరకు వుంటాయి. నైజాం ఏడు కోట్లకు కాస్త అటుగా అడ్వాన్స్ తీసుకున్నారని తెలుస్తోంది.
సరే, మొత్తం మీద ఈ ఇరవై కోట్ల పై చిలుకు అడ్వాన్స్ ల్లో ఎంత వరకు రికవరీ వుండొచ్చు అన్నది చూస్తే, ఉభయ తెలుగు రాష్ట్రాల్లో తొలిమూడు రోజుల్లో తొమ్మిది నుంచి పది కోట్ల మేరకు వచ్చినట్లు తెలుస్తోంది. సోమవారం టెస్ట్ పాస్ కాలేదు. నిజానికి శనివారం, ఆదివారమే చాలా అంటే చాలా తక్కువ చోట్ల ఫుల్స్ బోర్డులు కనిపించాయి. సోమవారం ఇరవై వేలు, ముఫై వేలు రేంజ్ లో ఒక్కో థియేటర్ కు కలెక్షన్లు కనిపించాయి.
గమ్మత్తేమిటంటే, బాక్సాఫీస్ సైట్ లు కానీ, బాక్సాఫీస్ నెంబర్లు ప్రకటించే సైట్లు ఏవీ ఈగిల్ నెంబర్లు ప్రకటించకపోవడం. అయినా అది వేరే సంగతి. చూస్తుంటే ఈగిల్ టొటల్ రన్ కలెక్షన్లు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో 12 కోట్లకు కాస్త అటు ఇటుగా వుండొచ్చని అంచనాలు వినిపిస్తున్నాయి.