తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఆంధ్రప్రదేశ్ కేంద్రంగా జరుగుతున్నాయి. ఆ చర్చలను గమనిస్తే… ఏపీ ప్రయోజనాలను సాధించుకోవడంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విజయవంతమయ్యారనే సంకేతాలు ఇచ్చారు. గతంలో అసెంబ్లీలో జగన్ ప్రసంగాన్ని తెలంగాణ అసెంబ్లీలో ప్రదర్శించడం విశేషం.
ఈ నేపథ్యంలో ఏపీలో అభివృద్ధే లేదని విమర్శిస్తున్న ప్రతిపక్షాలకు గట్టి సమాధానం చెప్పేందుకు తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్ని అధికార పక్షం ఆయుధంగా ఉపయోగించుకుంటోంది. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మంగళవారం మీడియాతో మాట్లాడుతూ ఏపీలో అభివృద్ధి ఏ స్థాయిలో జరుగుతున్నదో తెలుసుకోవాలంటే తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్ని చూడాలని కోరారు.
ఏపీకి సాగునీటి ప్రాజెక్టులు, వాటికి నీటిని తీసుకొచ్చి రైతాంగానికి ఎంతగా ప్రయోజనం కలిగించామో తెలంగాణ అసెంబ్లీలో మంత్రులే చెబుతున్నారన్నారు. వైఎస్సార్ సీఎంగా ఉన్నప్పుడు తెచ్చిన నీటి కంటే రెట్టింపు నీటిని ఆయన తనయుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీసుకొచ్చి నిలువ పెట్టారన్నారు.
టీడీపీ పతనవాస్థకు చేరిందని ఆయన అన్నారు. ఇది కేవలం ప్రారంభం మాత్రమే అని పెద్దిరెడ్డి చెప్పారు. తమ పరిపాలనా కాలంలో ప్రజానీకానికి ఏం చేశామో చెప్పుకునే పరిస్థితిలో టీడీపీ లేదని ఆయన అన్నారు. టీడీపీ అజెండాలో భాగంగానే షర్మిల ఏపీలో పని చేస్తున్నారని ఆయన అన్నారు. గతంలో టీడీపీ నమోదు చేసిన దొంగ ఓట్ల వల్లే కొన్ని నియోజకవర్గాల్లో ఓడిపోయామన్నారు. దొంగ ఓట్లతో తమకు సంబంధం లేదని ఆయన అన్నారు.