
పెద్ద పెద్ద వాళ్ల పెళ్లిళ్లకు వెళ్లి డ్యాన్సులు చేసి భారీ పారితోషికాలు పొందే సినీసెలబ్రిటీలకు కొత్త రకం తలనొప్పులు ఎదురవుతున్నట్టుగా ఉన్నాయి. వీరికి భారీ గిఫ్ట్ లు ఇచ్చి, పెళ్లిళ్లకు పిలిచి కోట్ల రెమ్యూనిరేషన్లు ఇచ్చి గంతులు వేయించుకునే వారు.. ఆ డబ్బును ఎలా సంపాదించుకున్నారో వీరికి తెలియకపోవచ్చు. అలాగే ఆ డబ్బులను కూడా వీరు చెక్ ల రూపంలో, అధికారిక రూట్లలో కాకుండా.. హవాలా ద్వారా పొందుతున్నారనే ప్రచారాలూ ఉన్నాయి. ఇలాంటి వ్యవహారంలోనే ఇప్పుడు బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్, నటి సన్నీ లియోన్ లు ఈడీ సమన్లను అందుకోనున్నారనే ప్రచారం జరుగుతూ ఉంది.
ముంబైలో ఒక బెట్టింగ్ యాప్ కు సంబంధించిన స్కామ్ ఒకటి వెలుగు చేసింది. దాని నిర్వాహకుడు సౌరభ్ చంద్రకర్ ను ఈడీ అదుపులోకి తీసుకుంది. ఇతడి ఫ్రాడ్ విలువ సుమారు 412 కోట్ల రూపాయలు అని వార్తలు వస్తున్నాయి. అందులో ఏకంగా రెండు వందల కోట్ల రూపాయల మొత్తాన్ని తన పెళ్లి సమయంలోనే వెచ్చించాడట! యూఏఈలో పెళ్లి చేసుకుని.. ఇతడు అక్కడకు బాలీవుడ్ సెలబ్రిటీలను కూడా పిలిపించుకున్నాడట!
ఆ పెళ్లికి హాజరైన వారిలో బాలీవుడ్ స్టార్లు కాకపోయినా.. ప్రముఖులు ఉన్నారు. అదే పెళ్లిలో సన్నీ లియోన్, టైగర్ ష్రాఫ్ లు డ్యాన్సులు కూడా చేశారు. దీనికి గానూ వారికి కోట్ల రూపాయల రెమ్యూనిరేషన్ అందింది. మరి డ్యాన్సులు చేసి సంపాదించుకోవడం వారి తప్పేం కాకపోయినా, చెల్లింపులు హవాలా మార్గంలో జరిగాయని ఈడీ గుర్తించిందట!
ఆ ఈవెంట్ మేనేజ్ మెంట్ కు గానూ చంద్రకర్ ఒక సంస్థకు 112 కోట్ల రూపాయలు చెల్లించాడట, ఆ మొత్తం అంతా హవాలా మార్గంలోనే చెల్లింపులు జరిగాయట! మరి ఈ హవాలా వ్యవహారంలో ఈవెంట్ మేనేజ్ మెంట్ సంస్థ మాత్రమే పాత్ర పోషించిందా? లేక పెళ్లికి హాజరైన తారలకు కూడా ఈ హవాలా మార్గంతో సంబంధం ఉందో తేల్చే పనిలో ఈడీ ఉందని తెలుస్తోంది. మరి వారికి సంబంధం ఉన్నా లేకపోయినా.. ఇలాంటి వ్యవహారాల్లో సినీతారల పేర్లు నానడం తప్పేలా లేదు. ఒకవైపు సుఖేష్ చంద్రశేఖరన్ వ్యవహారంలో తారల పేర్లపై విచారణ ఈడీ పరిధిలో ఉండగానే, మరో అంశం తెరపైకి వచ్చినట్టుగా ఉంది!
నేను మొక్కలతో, దేముడితో మాట్లాడుతా