టాలీవుడ్ లో మరో విషాదం నెలకొంది. నందమూరి తారకరత్న మరణం నుంచి కోలుకోక ముందే తెలుగు చిత్రసీమ మరో విషాద వార్తను వినాల్సి వచ్చింది. ప్రముఖ ఎడిటర్ జీజీ కృష్ణారావు(87) కన్నుముశారు. ఇవాళ ఉదయం బెంగుళూరులోని తన నివాసంలో ఆయన తుదిశ్వాస విడిచారు.
దాదాపుగా 300 పైగా సినిమాలకు ఎడిటర్ గా పనిచేసిన ఆయన శంకరాభరణం, సాగర సంగమం, సిరివెన్నెల, బొబ్బలిపులి, శ్రీరామరాజ్యం లాంటి ఎన్నో చిత్రాలకు ఎడిటర్ గా మంచి పేరు సంపాదించుకున్నారు. పూర్ణోదయా మూవీ క్రియేషన్స్, విజయ మాధవి ప్రొడక్షన్స్ నిర్మాణ సంస్థలకు కృష్ణారావు ఆస్థాన ఎడిటర్ అని పేరు తెచ్చుకున్నారు.
కళాతపస్వీ కె విశ్వనాథ్, బాపు, జంధ్యాల, దాసరి వంటి దిగ్గజ దర్శకులతో పని చేసిన ఆయన.. కేవలం ఎడిటర్ గానే కాకుండా నిర్మాతగా కూడా కొన్ని సినిమాలను నిర్మించారు. తెలుగుతో పాటు కొన్ని హిందీ, తమిళం, కన్నడ సినిమాలకు కూడా ఎడిటిర్ గా పని చేశాడు. ఆయన మరణం పట్ల పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు.