కేసీఆర్ మెట్టు దిగక తప్పదు!

కాస్త ముందూ వెనుకా జరిగి తీరవలసిందే. కేసీఆర్ మెట్టు దిగక తప్పదు. తాను మోనార్క్ ని అని, తాను చేయదలచుకున్నది మాత్రమే చేస్తానని, తనతో కలిసి వచ్చే వారిని మాత్రమే వెంటబెట్టుకుంటానని, ఆయన ఎంతగా…

కాస్త ముందూ వెనుకా జరిగి తీరవలసిందే. కేసీఆర్ మెట్టు దిగక తప్పదు. తాను మోనార్క్ ని అని, తాను చేయదలచుకున్నది మాత్రమే చేస్తానని, తనతో కలిసి వచ్చే వారిని మాత్రమే వెంటబెట్టుకుంటానని, ఆయన ఎంతగా అయినా గంభీరంగా పలకవచ్చు గాక.. కానీ అంతిమంగా ఆయన మెట్టుదిగక తప్పని పరిస్థితి ఉంది. జాతీయ రాజకీయాల్లో తన అస్తిత్వ నిరూపణ చేసుకోవాలని ఉత్సాహపడుతున్న కేసీఆర్.. లోకల్ గా పనిచేయని ప్రత్యేక సమీకరణాలను అక్కడ పాటించాల్సి ఉంటుంది. 

కేంద్రంలో మోడీ సర్కారుకు వ్యతిరేకంగా విపక్షాలు ఐక్యం కావడం గురించి మళ్లీ చర్చ జరుగుతోంది. అందరూ ఒకతాటిమీదకు రావాల్సిన అవసరం గురించి, ప్రధాని పదవి నాకు వద్దే వద్దు అనే నినాదంతో పనిచేస్తున్న, బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ తాజాగా మళ్లీ ప్రస్తావిస్తున్నారు. 

జాతీయ స్థాయిలో అనేక పార్టీలు కేంద్రంలో అధికార మార్పిడిని కోరుకుంటున్నాయి. మోడీ 3.0 ప్రభుత్వం ఏర్పడకూడదని అభిలషిస్తున్నాయి. వీరిలో చాలా మందికి, మోడీ మళ్లీ అధికారంలోకి వస్తే గనుక.. చిన్నా సన్నా ప్రాంతీయ పార్టీలు పూర్తిగా కనుమరుగు అయిపోతాయి అనే భయం కూడా ఉంది. కారణాలు ఏవైనా మోడీ పతనాన్ని కోరుకుంటున్న అనేక పార్టీలు కాంగ్రెస్ తో కలిపి ఉండగల కూటమివైపే మొగ్గుతున్నాయి. 

వారితో సమానంగా మోడీని వ్యతిరేకిస్తున్న కేసీఆర్ మాత్రమే కాంగ్రెస్ తో కూడా సమానదూరం పాటించాలనే పాట పాడుతున్నారు. నిజానికి ఆ మాట ఆయన అసలైన మనోభిలాష కాకపోవచ్చు. లేదా, నిజంగానే ఆ వాదనకు ఆయన కట్టుబడి ఉండొచ్చు. కేసీఆర్ అంటున్నారే తప్ప.. కాంగ్రెస్ ను ఆయన మిత్రులెవరూ ఆయన స్థాయిలో ద్వేషించడం లేదు. కాంగ్రెస్ పట్ల కూడా ద్వేషం అనేది కేసీఆర్ కు ఉన్న స్థానిక అవసరం మాత్రమే. 

జాతీయ రాజకీయాల్లో మోడీ పతనాన్ని కోరుకునే వారికి కేసీఆర్ ‘స్థానిక అవసరం’ గురించి పెద్దగా పట్టింపు ఉండదు. అందువలన వారు కేసీఆర్ ను కూడా కాంగ్రెస్ తో కలిసిన కూటమిలోకే రావాలని ఒత్తిడిచేసే అవకాశం ఉంటుంది. అయితే, గుడ్డిలో మెల్లగా కేసీఆర్ కు కలసివచ్చిన ఒక అద్భుతమైన అదృష్టం ఏంటంటే.. అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని నెలల ముందుగానే జరుగుతాయి. 

అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ను తిడితేనే తెలంగాణలో ఆయన రాజకీయం పండుతుంది. అసలే ఇప్పటికే కోమటిరెడ్డి మాటల పుణ్యమాని ఎన్నికల తర్వాత కాంగ్రెస్, భారాస మిలాఖత్ అవుతాయనే ప్రచారం బాగా జరుగుతోంది. దీనిని గులాబీ దళాలు తిప్పికొడుతున్నా.. అసెంబ్లీ విషయం పక్కన పెట్టి, పార్లమెంటు ఎన్నికల వేళ వచ్చేసరికి.. ఆయన ఖచ్చితంగా కాంగ్రెస్ ఉన్న జట్టుతోనే అడుగులు వేయాల్సి వస్తుంది. వేరే గత్యంతరం లేదు. 

లేకపోతే కేసీఆర్ ఒంటరి కావడమో లేదా, భాజపాకు ఎడ్వాంటేజీ గా మారడమో జరుగుతుంది.