గత కొన్ని నెలలుగా థియేటర్లకు దూరం అయిన ప్రేక్షకులను ఎలా మళ్లీ వెనక్కు రప్పించాలన్నదే ఎగ్జిబిటర్ల ఆందోళన. కానీ దానికి టాలీవుడ్ నుంచి అస్సలు సహకారం అందడం లేదు.
డిస్ట్రిబ్యూషన్, ఎగ్జిబిషన్ సెక్టార్టలో కూడా పెట్టుబడులు వున్న అగ్రనిర్మాతలు ఎవ్వరూ థియేటర్లు ఇప్పట్లో తెరవాలని కోరుకోవడం లేదు. ఈ విషయంలో సురేష్ బాబు, దిల్ రాజు, అల్లు అరవింద్, యువి వంశీ అంతా ఒక్క ఆలోచనతోనే వున్నారని తెలుస్తోంది.
కేవలం ఆసియన్ సునీల్ మాత్రమే థియేటర్లు తక్షణం తెరవాలనే కోరికతో వున్నారు. ఈ విషయంలో ఆయన తన భాగస్వామి సురేష్ బాబు ఆలోచనలతో విబేధిస్తున్నారు.
థియేటర్లు తెరవడానికి ముఖ్యంగా సింగిల్ స్క్రీన్ లోకల్ ఎగ్జిబిటర్లు సిద్దంగా వున్నారు. కానీ కంటెంట్ లేదు. కంటెంట్ ఇవ్వడానికి నిర్మాతలు రెడీగా లేరు.
ఎందుకంటే ఫుల్ ఆక్యుపెన్సీ వస్తే తప్ప కిట్టుబాటు కాదు. వారి సమస్యలు వారివి. కానీ ఇలాంటి టైమ్ లో నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు తలచుకుంటే ముందుగా థియేటర్లకు జనాలను రప్పించవచ్చు.
యాష్ రాజ్ ఫిలిమ్స్ ఇప్పుడు అదే పని చేస్తోంది. తమ సంస్థ నుంచి వచ్చిన మంచి మంచి సినిమాలను వివిధ మల్టీ ఫ్లెక్స్ ల్లో ఫ్రీగా ప్రదర్శనకు అనుమతించింది. మన నిర్మాతలకు కూడా ఇలా చేయొచ్చు.
పెద్ద నిర్మాణ సంస్థలు అన్నీ తమ తమ పాత సినిమాలను ఉచితంగా ప్రదర్శనకు ఇస్తే, ఎగ్జిబిటర్లు తక్కువ టికెట్ రేటుతో ప్రదర్శించుకోవచ్చు. దానివల్ల ప్రేక్షకుడు మెల్లగా థియేటర్లకు అలవాటు పడతారు.
ప్రస్తుతం ఒక్క థియెటర్ల వ్యాపారం తప్ప అన్ని వ్యాపారాలు సజావుగా నడుస్తున్నాయి. బార్ అండ్ రెస్టారెంట్లు కూడా కళకళలాడుతున్నాయి. థియేటర్లకు జనం రారని ఎందుకు అనుమానపడుతున్నారో సినిమా పెద్దలు అని ఎగ్జిబిటర్లు తలలు పట్టుకుంటున్నారు.
థియేటర్లతో సినిమా పెద్దలకు వ్యాపార బంధాలు వుండడం వల్లనే థియేటర్లు ఓపెన్ కావడం లేదని సింగిల్ థియేటర్ ఓనర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.