మంచు విష్ణు..ప్రకాష్ రాజ్ ల నడుమ పోరు తీవ్ర స్థాయికి చేరుకుంది. గత రెండు రోజులుగా ప్రకాష్ రాజ్ చాలా దూకుడుగా వెళ్తున్నారు. అదే సమయంలో మంచు విష్ణు ఒంటరి అయిపోతున్న సూచనలు కనిపిస్తున్నాయి. పెద్ద నటులు ఎవ్వరూ బాహాటంగా పెదవి విప్పడం లేదు. మద్దతు పలకడం లేదు. ఇటు కానీ అటు కానీ ఎవ్వరికీ పలకడం లేదు. కృష్ణంరాజు, కృష్ణ, బాలకృష్ణలతో ఫొటోలు తప్ప, వారి స్టేట్ మెంట్ లు ఏవీ రాలేదు. వచ్చినా పెద్దగా ప్రభావం వుండే అవకాశం తక్కువ.
మా ఎన్నికల్లో ఆరితేరిన వారంతా ఇప్పుడు ప్రకాష్ రాజ్ వైపు వచ్చేసారు. ప్రకాష్ రాజ్ అంటే పెద్దగా ఇష్టం వున్నా లేకపోయినా అటు మొగ్గేలా తయారైంది పరిస్థితి. నిన్న మొన్నటి దాకా ప్యానల్ అయితే ప్రకాష్ రాజ్ ది బాగుంది. కానీ అధ్యక్షుడిగా మంచు విష్ణుకు ఎడ్జ్ వుంది అనే టాక్ వుంది.
ఎవరు ఎంత కాదన్నా టాలీవుడ్ ఈ ఎన్నికల నేపథ్యంలో కమ్మ-కాపు అనే విధంగా చీలిపోయినట్లే కనిపిస్తోంది. ప్రకాష్ రాజ్ ప్యానల్ లో కాపు వర్గమే కీలకంగా వుందని వినిపిస్తోంది. అలా అని విష్ణు ప్యానల్ కమ్మ వర్గం ఏమీ కీలకంగా లేదు. కానీ బయట టాక్ మాత్రం అలాగే వచ్చేసింది.
కానీ సమస్య ఏమిటంటే, టాలీవుడ్ మీద చిరకాలంగా కమ్మవారి ఆధిపత్యం వుండే వుండొచ్చు కానీ, దాసరి హయాం నుంచి అది మారుతూ వచ్చింది. ఎప్పుడయితే పది మంది మెగా హీరోలు రంగంలొ వున్నారో అప్పటి నుంచి కమ్మ వారి హవా తగ్గడం ప్రారంభమైంది. కేవలం నిర్మాతలు, ఇన్ ఫాస్ట్రక్చర్ మాత్రమే వారి చేతిలో మిగిలింది. సీనియర్ హీరోలు దాదాపు రిటైర్డ్ స్టేజ్ కు వచ్చేసారు. జూనియర్లలో కాపు వర్గం హీరోలో ఎక్కవ.
అందువల్ల భవిష్యత్ లో చేతినిండా అవకాశాలు వుండాలి అంటే మెగా ప్రాపకం అవసరం అనే టాక్ ఇండస్ట్రీలో వుంది. ఆ మధ్య కొందరు సినిమాజనాలు మెగాస్టార్ ను పొగుడుతూ సోషల్ మీడియా పోస్టులు వదిలారు. వీరిలో కమ్మవారు కూడా వున్నారు. ఏమిటి కారణం అంటే ఏడాదికి పది వేషాలు రావాలంటే పది మంది హీరోలు అక్కడ వున్నారు. తప్పదు అనే సమాధానం వినిపించింది.
ఇప్పుడు ఓటింగ్ విషయానికి వచ్చినా అదే పరిస్థితి. పైగా సినిమా రంగంలో నిర్మాతలు, హీరోలు, ఇన్ ఫాస్ట్రక్చర్ విషయంలో కమ్మవారు ముందు వున్నారు కానీ చిన్నా, చితక నటులుకాదు. అందువల్ల మా లో ఓటింగ్ శాతానికి వచ్చేసరికి కమ్మవారికి అంత పట్టు లేదు.
అసలే టాలీవుడ్ లో పట్టు సడలిపోతోంది. ఎగ్జిబిషన్, డిస్ట్రిబ్యూషన్ రంగాల్లో నాన్ కమ్మవారే కీలకంగా వున్నారు. హీరొలు కూడా వారే పెరుగుతున్నారు. ఇక మిగిలింది నిర్మాతలు మాత్రమే. ఇలాంటి నేపథ్యంలో మంచు విష్ణు పోటీ అన్నది మరోసారి ఆ వర్గాన్ని నిలబెడుతుందా? దెబ్బ మీద దెబ్బ పడుతుందా? అన్నది తేల్చేలా వుంది.
గమ్మత్తేమిటంటే కాపు వర్గం ప్రతిష్టాత్మకంగా తీసుకుని తెరవెనుక ప్రకాష్ రాజ్ వర్గం కోసం గట్టిగా కృషి చేస్తోంది. కానీ విష్ణు వెనుక మాత్రం కమ్మ వర్గం ఎవ్వరూ నిల్చున్నట్లు కనిపించడం లేదు. పైగా వైకాపా వైపు విష్ణు ఫ్యామిలీ మొగ్గినప్పటి నుంచి కమ్మవారికి ఆ కుటుంబం మీద కాస్త గుర్రుగా వుంది. ఇలాంటి టైమ్ లో వైకాపా మంత్రి తమకు ఈ ఎన్నికతో సంబంధం లేదని ఓ స్టేట్ మెంట్ పడేసారు. దీని వెనుక కూడా మెగాస్టార్ మంత్రాంగం వుందని టాక్ వినిపిస్తోంది.
మొత్తానికి ఈసారి ఎన్నికలు టాలీవుడ్ లోని పరువు ప్రతిష్టల సమస్యగా మారినట్లు కనిపిస్తోంది.