ఎవరితో అన్నా ఓకె..బండ్లతో కాదు

కొందరితో అంతే. కోరి కందిరీగల తుట్టను కదిలించినట్లే. సోషల్ మీడియాలో బాగా పాపులారిటీ వున్న నిర్మాత, నటుడు బండ్ల గణేష్. సినిమా నిర్మించి ఏళ్లు దాటిపోతూన్నా, నిత్యం సోషల్ మీడియాలో ఫుల్ జోష్ తో…

కొందరితో అంతే. కోరి కందిరీగల తుట్టను కదిలించినట్లే. సోషల్ మీడియాలో బాగా పాపులారిటీ వున్న నిర్మాత, నటుడు బండ్ల గణేష్. సినిమా నిర్మించి ఏళ్లు దాటిపోతూన్నా, నిత్యం సోషల్ మీడియాలో ఫుల్ జోష్ తో వుంటూనే వస్తున్నాడు. పవన్ ఫ్యాన్స్ అంతా కలిసి బలవంతంగానైనా తమ హీరోను ఒప్పించి బండ్ల గణేష్ తో సినిమా చేయించేంత అభిమానం వారిలో సంపాదించుకున్నాడు. 

అలాంటి వాడు చటుక్కున ప్రకాష్ రాజ్ ప్యానల్ ను వదిలేసి పక్కకు వచ్చాడు. దాంతో మా ఎన్నికల హడవుడి మళ్లీ రాజుకుంది. సరే కేవలం బండ్ల బయటకు వచ్చి, పోటీ చేస్తే పెద్ద సమస్య కాదు. గెలిస్తే గెలుస్తాడు. లేదంటే లేదు. కానీ బండ్ల ఎప్పటివో వీడియోలు గట్రా బయటకు తీసి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నాడు.

జీవిత-రాజశేఖర్ గతంలో మెగాస్టార్ నో, పవన్ నో విమర్శించిన వీడియోలు అవి. ఈ వ్యవహారం చూస్తుంటే అయితే జీవిత తనకెందుకు వచ్చిన తంటా అని ప్యానల్ నుంచి బయటకు అన్నా రావాలి. లేదా ప్రకాష్ రాజ్ ప్యానల్ కు మెగా మద్దతు అన్న ట్యాగ్ లైన్ అన్నా పోవాలి, అన్నట్లుంది. బండ్ల పాయింట్ తో ఏకీభవించిన వారు జీవితను చూసి ప్రకాష్ రాజ్ ప్యానల్ కు దూరంగా వుంటారా? 

ఇవన్నీ తేలాలి అంటే బండ్ల గణేష్ ఇండిపెండెంట్ గా వుంటారా? మరో ప్యానల్ లో చేరతారా? ఈ రచ్చను ఏ మేరకు కొనసాగిస్తారు అన్న దాని మీద ఆధారపడి వుంటుంది.