జగన్ ప్రభుత్వం, ఏపీ బీజేపీ మధ్య వినాయక చవితి రగడకు దారి తీసింది. దీంతో ఇరు పక్షాలు పరస్పరం సవాళ్లు చేసుకుంటూ రాజకీయంగా కవ్వింపు చర్యలకు దిగాయి. ఈ నేపథ్యంలో మతాన్ని అడ్డు పెట్టుకుని రెచ్చగొట్టే చర్యలకు పాల్పడితే తమ ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుతో పాటు ఆ పార్టీ నేతలకు రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ గట్టి హెచ్చరిక చేశారు.
నిన్న వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు తీవ్ర హెచ్చరికలు చేయడం తెలిసిందే. నేడు బీజేపీపై విరుచుకుపడే వంతు దేవాదాయశాఖ మంత్రికి వచ్చింది. మంత్రి మీడియాతో మాట్లాడుతూ సోము వీర్రాజు మతాల మధ్య చిచ్చు పెట్టేలా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతోనే వినాయక చవితి వేడుకలపై నిర్ణయం తీసుకున్నట్టు మంత్రి తెలిపారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా సోము వీర్రాజు పని చేస్తున్నారని ధ్వజమెత్తారు.
హిందూమతంపై బీజేపీ నేతలకు గౌరవం ఉంటే గతంలోనే ప్రశ్నించేవారన్నారు. ఆలయాలను కూల్చిన టీడీపీని బీజేపీ ఏనాడూ ప్రశ్నించలేదని మంత్రి గుర్తు చేశారు. వినాయక చవితి చేసుకోవద్దని తమ ప్రభుత్వం చెప్పలేదన్నారు. దీనిపై బీజేపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
ప్రజలను రెచ్చగొట్టొద్దని ఆయన వేడుకున్నారు. మతవిద్వేషాలను రెచ్చగొట్టేందుకు యత్నిస్తే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని మంత్రి ఘాటు హెచ్చరికలు చేశారు. వినాయక చవితి అందరి పండుగన్నారు. పెద్ద విగ్రహాలు, ఊరేగింపులు పెట్టకూ డదని మాత్రమే సూచించామన్నారు. కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగానే బహిరంగంగా వినాయకుని మండపాల ఏర్పాటుపై ఆంక్షలు విధించినట్లు మంత్రి వెల్లంపల్లి తెలిపారు.