ఏపీ బీజేపీ బాటలో టీడీపీ అధినేత చంద్రబాబు నడవక తప్పని పరిస్థితి. ఆంధ్రప్రదేశ్‌లో వినాయక చవితి వేడుకల నిర్వహణపై కరోనా నేపథ్యంలో ప్రభుత్వం ఆంక్షలు విధించడం వివాదాస్పదమైంది. హిందువులు వర్సెస్ వైసీపీ అనే సెంటిమెంట్‌ను బీజేపీ రగిల్చింది. జగన్ ప్రభుత్వాన్ని ఈ వ్యవహారం ఇరుకున పెడుతోంది.
వినాయక చవితిపై సాగుతున్న వివాదాన్ని టీడీపీ రెండు రోజులుగా జాగ్రత్తగా గమనిస్తోంది. రాజకీయంగా ఇది ఉపయోగపడుతుందని భావించిన చంద్రబాబు సోమవారం బీజేపీ బాటను ఎంచుకున్నారు. పార్టీ ముఖ్యనేతలతో నిర్వహించిన సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ వినాయక చవితి పూజలకు ఆంక్షలు ఏ విధంగా పెడతారని ప్రశ్నించారు.
ఇడుపులపాయతో పాటు రాష్ట్రవ్యాప్తంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతికి వర్తించని కోవిడ్ నిబంధనలు వినాయక చవితికి ఏవిధంగా వర్తిస్తాయని ఆయన నిలదీశారు. తెలంగాణలో వినాయక పూజలకు అనుమతించగా ఏపీలో మాత్రం ఎందుకు నిరాకరించారని ఆయన ప్రశ్నించారు.
కొవిడ్ నిబంధనలు పాటిస్తూనే రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో ఈ నెల 10న చవితి పూలజను నిర్వహించాలని టీడీపీ తీర్మానించడం గమనార్హం. వినాయక చవితి వేడుకపై సాగుతున్న ప్రతికూల ప్రచారాన్ని తిప్పి కొట్టడం అధికార పార్టీ వైసీపీకి సవాల్‌గా మారింది.
ప్రతిపక్షాలన్నీ కలిసి వైసీపీని హిందూ వ్యతిరేక పార్టీగా చిత్రీకరించేందుకు వినాయక చవితిని అనుకూలంగా మలుచుకుంటున్నాయి.