మతం మత్తులాంటిదన్నారు మార్క్సిస్ట్ మహనీయుడు. సాంకేతికంగా సమాజం ఎంతో ప్రగతి సాధించింది. అయినప్పటికీ మతాలు, కులాలుగా మనుషులను విడిగొట్టే దుష్ట శక్తులు చెలరేగుతూనే వున్నాయి.
తాజాగా ఆంధ్రప్రదేశ్‌లో వినాయక చవితి వేడుకలను సాకుగా తీసుకుని కొన్ని రాజకీయ పార్టీలు మత రాజకీయాలకు పాల్పడుతున్నాయి. మతమనే సున్నిత అంశాన్ని ఓటు బ్యాంకు రాజకీయాలకు నిస్సిగ్గుగా వాడుకుంటున్నాయని ప్రజాస్వామిక వాదులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు వినాయక చవితి వివాదంలో తలదూర్చారు. జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏ చిన్న అవకాశం దొరికినా ఆయన విడిచిపెట్టరనే విషయం అందరికీ తెలిసిందే.
కరోనా థర్డ్ వేవ్ హెచ్చరికలు, ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ….కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను పరిగణలోకి తీసుకున్న జగన్ ప్రభుత్వం వినాయక చవితి వేడుకల నిర్వహణకు షరతులు వర్తిస్తాయని చెప్పడం తెలిసిందే.
ఇదే అదనుగా భావించిన రఘురామకృష్ణంరాజు ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఏసుకు లేని కరోనా గణేశ్‌కు ఎందుకని ఆయన ప్రశ్నించారు. చర్చిల్లో ప్రార్థనలకు అనుమతించారని గుర్తు చేశారు. అక్కడ కరోనా రాదా అని ఆయన ప్రశ్నించారు. హిందువులందరూ ఆరాధించే విఘ్నేశ్వరుని పూజలకు అడ్డంకులు ఎందుకు సృష్టిస్తున్నారని ఆయన ప్రశ్నించడం గమనార్హం.
విగ్రహాలు ధ్వంసం చేసిన వాళ్ళను పట్టుకోలేక పోయారని, చివరికి విగ్రహాలు అమ్మనీయకుండా చేస్తారా? అని హిందువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారంటూ రఘురామ విమర్శలు గుప్పించారు. సీఎం జగన్ మొండి పట్టుదల వీడి అన్ని మతాల వారిని ఒకేలా చూడాలని రఘురామ హితవు చెప్పడం విశేషం. మొత్తానికి దేవుళ్లను రాజకీయాల్లోకి లాగారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.