ఆదిపురుష్ థియేటర్లలో దళితులకు ప్రవేశం లేదా?

“రామాయణ పారాయణం జరిగే చోట పవిత్రంగా ఉండాలనేది మా నమ్మకం. ఈ నమ్మకాన్ని గౌరవిస్తూ, ప్రభాస్ రాముడిగా నటించిన ఆదిపురుష్ సినిమా ప్రదర్శించే థియేటర్లలో దళితులకు ప్రవేశం లేదు.” Advertisement ఆదిపురుష్ పోస్టర్ పై…

“రామాయణ పారాయణం జరిగే చోట పవిత్రంగా ఉండాలనేది మా నమ్మకం. ఈ నమ్మకాన్ని గౌరవిస్తూ, ప్రభాస్ రాముడిగా నటించిన ఆదిపురుష్ సినిమా ప్రదర్శించే థియేటర్లలో దళితులకు ప్రవేశం లేదు.”

ఆదిపురుష్ పోస్టర్ పై కనిపించిన స్టేట్ మెంట్ ఇది. దీంతో ఒక్కసారిగా పౌరసమాజం భగ్గుమంది. ఆదిపురుష్ సినిమాను దళితులు చూడకూడదా? అనే ప్రశ్న ఉత్పన్నమైంది. దీనిపై వెంటనే ఆదిపురుష్ యూనిట్ స్పందించింది. ఆదిపురుష్ యూనిట్ సమానత్వానికి కట్టుబడి ఉందని, ప్రేక్షకుల మధ్య ఎలాంటి వర్ణవివక్ష, కులవివక్ష, పక్షపాతం చూపించదని ప్రకటించింది.

ఆదిపురుష్ పోస్టర్ పై వచ్చిన పై ప్రకటనతో యూనిట్ కు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసిన యూనిట్, ఇలాంటి తప్పుడు ప్రచారాన్ని ఎవరూ ప్రోత్సహించొద్దని విజ్ఞప్తి చేసింది.

మరోవైపు ఈ వ్యవహారంపై తిరుపతి పోలీసులు కూడా దృష్టిసారించారు. తిరుపతి కేంద్రంగా బయటపడిన ఈ పోస్టర్ పై పోలీసులు విచారణ మొదలుపెట్టారు. ఈ పోస్టర్ ను వైరల్ చేయొద్దని, ఎవరైనా ఈ పోస్టర్ తో ప్రచారానికి పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని తిరుపతి ఎస్పీ హెచ్చరించారు.

మరోవైపు ఆదిపురుష్ సినిమాను మరింతమంది ప్రేక్షకులకు దగ్గర చేసేందుకు నిర్మాత అభిషేక్ అగర్వాల్, వినూత్న ఆలోచనతో ముందుకొచ్చారు. ఆదిపురుష్ సినిమా చూడాలనుకునే ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు, అనాధ శరణాలయాలు, వృద్ధాశ్రమాలకు 10వేలకు పైగా టిక్కెట్లను ఉచితంగా ఇచ్చేందుకు ముందుకొచ్చారు. శ్రీరాముని మార్గాన్ని అనుసరించడం ఈ తరానికి ఎంతో అవసరమని అభిప్రాయపడిన ఆయన.. తెలంగాణ వ్యాప్తంగా తన ఆఫర్ వర్తిస్తుందని ప్రకటించారు.