ఫ్యామిలీలు థియేటర్ కు వస్తాయనే నమ్ముతున్నాం

మహిళలు ఎక్కువగా వుండే ఉమ్మడి కుటుంబంలో వారసుడిగా ఒకే మగాడు వుంటే అతనిపై వారి ఆప్యాయతలు, అనురాగాలు ఎలా వుంటాయనే పాయింట్తో `ఆడవాళ్ళు మీకు జోహార్లు` చిత్రం రూపొందిందని చిత్ర నిర్మాత సుధాకర్ చెరుకూరి…

మహిళలు ఎక్కువగా వుండే ఉమ్మడి కుటుంబంలో వారసుడిగా ఒకే మగాడు వుంటే అతనిపై వారి ఆప్యాయతలు, అనురాగాలు ఎలా వుంటాయనే పాయింట్తో `ఆడవాళ్ళు మీకు జోహార్లు` చిత్రం రూపొందిందని చిత్ర నిర్మాత సుధాకర్ చెరుకూరి అన్నారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై రూపొందిన ఈ సినిమాలో శర్వానంద్, రష్మిక మందన్న జంటగా నటించారు. 

కిశోర్ తిరుమల దర్శకత్వం వహించారు. శ్రీకాంత్ సహ నిర్మాతగా వ్యవహరించారు. ఈ చిత్రం ఈనెల 4న విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత సుధాకర్ చెరుకూరి మీడియా సమావేశంలో పలు విషయాలను తెలియజేశారు.

– `పడి పడి లేచె మనసు` తర్వాత చక్కటి ఫ్యామిలీ సినిమా చేయాలనుకున్నాం. ఆ సమయంలో కిశోర్ దగ్గర కథ వుందని తెలిసి విన్నాం. మేం ఏదైతే అనుకుంటున్నామో అదే ఈ కథ అనిపించింది. వెంటనే సినిమాను ప్రారంభించాలనుకున్నాం. కానీ రష్మిక, ఖష్బూ, రాధిక డేట్స్ వల్ల ఆరునెలలు ఆలస్యమయింది.

– ఉమ్మడి కుటుంబంలోని ఆప్యాయతలు కథ కాబట్టి నాకు బాగా నచ్చింది. పది మంది మహిళలు వున్న కుటుంబంలో ఒకే మగాడు వుంటే అతనిపై వున్న ప్రేమతో అతనికి తెలీకుండా ఇబ్బంది పెట్టే సన్నివేశాలు బాగా చూపించాం. ఇవి అందరికీ కనెక్ట్ అవుతాయని చెప్పగలను.

– మా సినిమా పాయింట్ నచ్చి క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ వాయిస్ ఓవర్ ఇవ్వడం విశేషం.. ఈ సందర్భంగా ఆయనకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.

– ఒకరకంగా ఇంతమంది నటీనటులతో సినిమా చేయడం సాహసమే అని చెప్పాలి. ఇంతమంది సీనియర్స్తో చేస్తానని అనుకోలేదు. నా కుటుంబసభ్యులతోనే వున్నట్లు అనిపించింది.

– కిశోర్ తిరుమల వినోదంతోపాటు కుటుంబ విలువలను బాగా ఎలివేట్ చేస్తాడు. కిశోర్ అనుకున్న సమయంలో పూర్తి చేయగలడు. అందుకే నటీనటులు డేట్స్ కుదిరాక చేయగలిగాం. కోవిడ్ టైంలోనూ నటీనటుల ప్రోత్సాహంతో పూర్తి చేయగలిగాం.

– శర్వానంద్తో రెండవ సినిమా. తను నిర్మాతగా కాకుండా సోదరిడిలా ట్రీట్ చేశాడు. పడిపడి లేచె మనసు అనుకున్నంతగా ఆడలేదు. అందుకే అప్పటినుంచి మంచి సినిమా వుంటే చేద్దామని అనుకున్నాం.

– `ఆడవాళ్ళు మీకు జోహార్లు` చిత్రం కోవిడ్ తర్వాత కుటుంబాలను థియేటర్కు తీసుకు వస్తుందనే నమ్మకం వుంది. ఎందుకంటే ప్రతి కుటుంబంలోనూ పెద్దమ్మలు, చిన్నమ్మలు, బామ్మలు, తల్లి దండ్రులు వుంటారు. నా కుటుంబంలోనూ ఇటువంటి వారున్నారు. నేనూ కనెక్ట్ అయ్యాను. ఈ సినిమా చూశాక ప్రతివారూ ఎక్కడోచోట కనెక్ట్ అవుతారు.

– ఈ చిత్రం లో ఫ్యామిలీ డ్రామాతో పాటు కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ వుంటుంది. హీరో హీరోయిన్ల మధ్య జరిగే సన్నివేశాలు వినోదాన్ని పండిస్తాయి. ఇక సత్య, వెన్నెల కిశోర్, ప్రదీప్ రావత్ పాత్రలు మరింత ఎంటర్టైన్ చేస్తాయి.

– ఈ చిత్ర కథ రాజమండ్రిలో జరిగేది. అందుకే ఆ చుట్టుపక్కల ప్రాంతాలైన అన్నవరం, అంతర్వేది తదితర ప్రాంతాల్లో షూట్ చేశాం.

– నేను చేయబోయే సినిమాలు ఒక్కోటి ఒక్కో భిన్నమైన కథలతో రూపొందుతున్నాయి. రవితేజతో `రామారావు ఆన్ డ్యూటీ` సిన్సియర్ కలెక్టర్ నేపథ్యంలో సాగుతుంది. రానా `విరాటపర్వం` 1945 నక్సల్స్ బేక్డ్రాప్, నాని దసరా చిత్రం వినూత్నమైన అంశం. గోదావరిఖని బేక్డ్రాప్ కథ. సెట్ కూడా వేస్తున్నాం.