‘మా’ ఎన్నికల పుణ్యామా అని మంచు, మెగా కుటుంబాల మధ్య గ్యాప్ ఏర్పడిందనే వాదన బలంగా వినిపిస్తోంది. మరోవైపు మంచు విష్ణు, ఆయన తండ్రి మోహన్‌బాబుపై మెగా బ్రదర్ నాగబాబు ఘాటు వ్యాఖ్యలు కూడా ఇలాంటి ప్రచారానికి బలం చేకూర్చాయి. దీనికి తోడు పవన్‌కల్యాణ్ సినిమా మార్నింగ్ షో కలెక్షన్ అంత నీ సినిమా బడ్జెట్ ఉండదని మంచు విష్ణుపై ప్రకాశ్‌రాజ్ తీవ్ర వ్యాఖ్యలు. ఈ వ్యాఖ్యలను తీసుకుని జనసైనికులు, పవర్‌స్టార్ అభిమానులు సోషల్ మీడియాలో మంచు విష్ణు కుటుంబంపై చెలరేగిపోయారు.
అసలే పవన్‌కల్యాణ్ అభిమానులు…పూనకం వచ్చిన మాదిరిగా ఊగిపోయారు. టికెట్ల విషయంలో పవన్‌కల్యాణ్ వైఖరిని మంచు విష్ణు బహిరంగంగానే తప్పు పట్టారు.అంతేకాదు, ప్రకాశ్‌రాజ్ సినీ రంగం వైపా? పవన్‌కల్యాణ్ వైపా? చెప్పాలని గట్టిగా నిలదీయడం మెగా అభిమానులకి చిర్రెత్తుకొచ్చింది. సోషల్ మీడియా వేదికగా మంచు కుటుంబంపై దాడికి దిగారు. ముఖ్యమంత్రి జగన్‌తో లింక్ పెట్టి నానా తిట్లు తిట్టారు.
చివరికి మంచు విష్ణు గెలుపొందారు. మెగా బ్రదర్స్ బలపరిచిన ప్రకాశ్‌రాజ్ ప్యానల్ ఓడిపోయిందనే అప్రతిష్ట మిగిలింది. ఈ నేపథ్యంలో తమ ఆరాధ్య నాయకుడు పవన్‌కల్యాణ్‌ను మంచు మనోజ్ కలవడం ప్రాధాన్యం సంతరించుంది. ఇద్దరూ కలిసి ముచ్చట్లు చెప్పుకున్నారు. అంతెందుకు ఎన్నికల రోజు కూడా మోహన్‌బాబు, పవన్‌కల్యాణ్ చెట్టపట్టాలేసుకుని తిరిగారు.
చిరంజీవి, మంచు విష్ణు ఆప్యాయంగా పలకరించుకున్నారు. మోహన్‌బాబు-రామ్‌చరణ్, విష్ణు -రామ్‌చరణ్ స్నేహమేరా జీవితం అంటూ కౌగిలింతల్లో మునిగి తేలడం అందరం చూసి ముక్కున వేలేసుకోవాల్సి వచ్చింది. మరి వాళ్ల కోసం చొక్కాలు చించుకుంటున్న అభిమానులే వేర్రోళ్లు అంటే… కాదనగలమా? ముఖ్యంగా పవన్‌కల్యాణ్ అభిమానుల్లారా మీ గురించే ఈ మాట!