కరోనా పరిస్థితులు తగ్గుముఖం పట్టి, థియేట్రికల్ బిజినెస్ మళ్లీ గాడిన పడ్డంతో.. స్క్రీన్ల గోల మళ్లీ మొదలైంది. తమకే ఎక్కువ స్క్రీన్లు కావాలంటూ నిర్మాతలు పట్టుబడుతున్నారు. మొన్నటివరకు థియేటర్లన్నీ ఖాళీ. చిన్న సినిమాలకు కూడా కావాల్సినన్ని స్క్రీన్లు పుష్కలంగా దొరికాయి.
ఎప్పుడైతే బిజినెస్ గాడిన పడిందని నమ్మకం వచ్చిందో, సినిమాలన్నీ వరుసగా క్యూ కట్టాయి. దీంతో థియేటర్ల కొరత మళ్లీ మొదలైంది. ఈ దసరా సీజన్ కు మహాసముద్రం, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, వరుడు కావలెను, పెళ్లి సందD సినిమాలు బరిలో నిలిచాయి.
ఆల్రెడీ థియేటర్లలో లవ్ స్టోరీ, సీటీమార్, రిపబ్లిక్ లాంటి సినిమాలు నడుస్తున్నాయి. వీటికి అదనంగా కొండపొలం కూడా చేరింది. ఇలాంటి టైమ్ లో భారీ సంఖ్యలో స్క్రీన్లు కోసం ప్రయత్నిస్తోంది గీతా ఆర్ట్స్ సంస్థ. అఖిల్ సినిమాను రికార్డ్ థియేటర్లలో రిలీజ్ చేయాలనేది ఆలోచన. దీనికోసం అన్ని వనరుల్ని, కాంటాక్టుల్ని వాళ్లు ఇప్పటికే వాడేశారు.
అటు మహాసముద్రం సినిమాను కూడా అంతే భారీ ఎత్తున రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు నిర్మాత అనీల్ సుంకర. దీంతో ఈ రెండు సినిమాల మధ్య కొత్త పోటీకి తెరలేచింది. మధ్యలో పెళ్లి సందD సినిమా కోసం రాఘవేంద్రరావు, ఆర్కా మీడియా లాబీయింగ్ ఉండనే ఉంది.
దీంతో నాగశౌర్య నటించిన వరుడు కావలెను సినిమాకు చిక్కొచ్చిపడింది. మంచి సెంటర్లలో థియేటర్లు దొరక్కపోవడంతో పాటు.. తగినన్ని సంఖ్యలో స్క్రీన్స్ అందుబాటులో లేని కారణంగా వరుడు కావలెను సినిమా విడుదలను వాయిదా వేసుకుంది సితార ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ. ఉన్నఫలంగా ప్రచార కార్యక్రమాలన్నీ ఆపేసింది.
మహాసముద్రం, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లాంటి సినిమాలకే ఇలాంటి పరిస్థితి ఉంటే.. రాబోయే రోజుల్లో ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్ లాంటి సినిమాలు ఒకేసారి వస్తున్నాయి. అప్పుడు థియేటర్ల కోసం ఇంకెంత పోటీ ఉంటుందో.