తెలంగాణలో దుకాణం మూయడానికి రెడీనా పవన్?

నా దగ్గర డబ్బుల్లేవు, నేను పార్టీ నడపలేను, అందుకే తెలంగాణలో పార్టీని పట్టించుకోవట్లేదు అని ఆమధ్య తేల్చి చెప్పారు పవన్ కల్యాణ్. అలాంటి పవన్ ఇప్పుడు తెలంగాణ పార్టీ నేతలతో ముఖ్యమైన సమావేశం అంటూ…

నా దగ్గర డబ్బుల్లేవు, నేను పార్టీ నడపలేను, అందుకే తెలంగాణలో పార్టీని పట్టించుకోవట్లేదు అని ఆమధ్య తేల్చి చెప్పారు పవన్ కల్యాణ్. అలాంటి పవన్ ఇప్పుడు తెలంగాణ పార్టీ నేతలతో ముఖ్యమైన సమావేశం అంటూ కబురందించారు. అక్టోబర్ 9న హైదరాబాద్ లో మీటింగ్ పెట్టుకున్నారు. ఇంతకీ ఏం చెబుతారు. దుకాణం మూసేస్తానని అధికారికంగా చెబుతారా..? నా దగ్గర డబ్బుల్లేవు, నేను పార్టీ నడపలేను అంటారా..? ఏ పార్టీలో చేరాలో దిశా నిర్దేశం చేస్తారా..?

తెలంగాణే బెటరేమో..?

ఆ మధ్య పవన్ పై వచ్చిన విమర్శలకు ఏపీలో కంటే, తెలంగాణ నుంచే ఎక్కువ ప్రతిఘటన ఎదురైంది. ఏపీ మంత్రులు పవన్ కి చీవాట్లు పెట్టినా, ఎక్కడా జనసైనికులు వారిని అడ్డగించే ప్రయత్నం చేయలేదు, తెలంగాణలో మాత్రం పోసానిపై ఏకంగా దాడి చేయడానికి ప్రయత్నించారు పవన్ అభిమానులు. 

ఈ సందర్భంలో ఏపీ కంటే తెలంగాణ జనసైనికులే కాస్త పవర్ ఫుల్ గా కనిపించారనే వార్తలొచ్చాయి. దీంతో ఒకసారి వారందరికీ థ్యాంక్స్ చెప్పేందుకు పవన్ బయలుదేరాడేమోనని అనిపిస్తోంది.

పవన్ కి కోస్తాతో పాటు నైజాంలో కూడా ఫ్యాన్ బేస్ ఎక్కువ. కానీ తెలంగాణ విడిపోయిన తర్వాత అందరూ సైలెంట్ గా ఉన్నారు. వర్మ 'పవర్ స్టార్' సినిమా సమయంలో, పోసాని వ్యాఖ్యల సందర్భంలో.. అప్పుడప్పుడు వారు వయలెంట్ గా మారుతున్నారు. ఆ అభిమానాన్ని ఒక స్ట్రీమ్ లైన్ లో పెట్టడానికి పవన్ ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది.

ఈ హడావిడి మామూలే కదా..!

తెలంగాణ లో ఎప్పుడు ఏ ఎన్నికలు వచ్చినా పవన్ హడావిడి మొదలుపెడతారు. సరిగ్గా ఎన్నికలకు ముందు తప్పుకుంటారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక మినహా.. ప్రస్తుతానికి తెలంగాణలో మిగతా ఎన్నికలేవీ లేకపోయినా.. బీజేపీ, కాంగ్రెస్ హుషారైపోవడం, షర్మిల జనాల్లోకి రావడంతో వాతావరణం మాత్రం వేడిగానే ఉంది. ఈ దశలో పవన్ కూడా అక్కడ పార్టీ మీటింగ్ పెట్టి హడావిడి చేయాలనుకుంటున్నారు. అది ఎంతవరకు సాధ్యమవుతుందో చూడాలి.

బీజేపీతో తెగతెంపులైతే..?

బీజేపీతో పొత్తు ఉంది కాబట్టి గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో జనసైనికులు త్యాగాలు చేశారు, భవిష్యత్ లో పొత్తు లేకపోతే ఆ త్యాగాలన్నీ వృథాయే కదా, అందుకే పార్టీ శ్రేణుల్ని సమాయత్తం చేయడానికి పవన్ హైదరాబాద్ వెళ్తున్నారా అనేది కూడా తేలాల్సి ఉంది. 

ప్రస్తుతానికి హుజూరాబాద్ ఎన్నికల వరకు పవన్ పోటీకి దూరంగా ఉంటున్నారు. సో.. తెలంగాణలో పార్టీ నడపడంపై జనసైనికులకు మాత్రం ఏదో ఒకటి క్లారిటీ ఇచ్చేస్తారని మాత్రం తెలుస్తోంది.