సినీనటులనబడే వాళ్లు సినిమాల్లో నటిస్తారు, సంపాదించుకుంటారు, ఉన్నంతలో బతుకుతారు, కుదిరినంత దాచుకుంటారు. కెరీర్ అయిపోయాక వేరే వ్యాపారాలో, ఉద్యోగాలో చేసుకుంటారు. మళ్లీ అనుకోకుండా అవకాశాలొస్తే నటిస్తారు, డబ్బు తీసుకుంటారు (అరవింద స్వామిలాగ).
ఇక ఎప్పటికీ అవకాశాలు రానివారికి, ముందు వెనుకా ఎవరూ లేని వారికి వృద్ధాప్యంలో తోడుండానికి అదే రంగానికి చెందిన పెద్దలు నాలుగు చేతులు వేస్తే ఆయా జీవితాలు ప్రశాంతంగా వెళ్లిపోతాయి.
అలా ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్న అలనాటి నటీనటులు కొందరిని దర్శకుడు పూరీ జగన్నాథ్, హీరో రజినీకాంత్ లాంటి వాళ్లు జీవితాంతం ఆదుకున్న, ఆదుకుంటున్న విషయం ఇండస్ట్రీలో చాలామందికి తెలుసు. అది వాళ్ల ఔదార్యం.
నిజానికి ఇలాంటి వారికి పనిచేసిన రంగంతో సంబంధం లేకుండా ప్రభుత్వం కల్పించే వృద్ధాప్య పించన్లు లాంటివి ఎలాగూ ఉంటాయి.
ఇన్నున్నా సేవని సంస్థాగతంగా చేసే ఉద్దేశ్యంతో ఏర్పడ్డ “మా” అసోషియేషన్ లైఫ్ ఇన్సూరెన్స్ వంటివి పెట్టి ఏ నటుడైనా, నటీమణియైనా చనిపోతే వారి కుటుంబాలకి రూ 3 లక్షలు ఇస్తూ వచ్చారు. అంత వరకూ బాగానే ఉంది.
ఏ రంగంలోని వారికైనా వృద్ధాప్యంలో ఎవరూ తోడు లేనప్పుడు ప్రభుత్వమూ, మానవత్వం ఉన్నవాళ్లు, స్వచ్చంద సంస్థలు, “మా” అసోషియేషన్ ఇంతవరకూ సేవనందించడం హర్షణీయం.
కానీ ఎప్పుడైతే వాగ్దానాలు శ్రుతి మించుతాయో, కోరికలు మబ్బులు దాటుతాయో అప్పుడే కామన్ మ్యాన్ ఆశ్చర్యంతో నాలుక బయటపెట్టి ముక్కున వేలేసుకుంటాడు. “వీళ్లకింత అవసరమా!!” అనుకుంటాడు. గత కొన్ని రోజులుగా “మా” ఎన్నికల మీద జరుగుతున్న ప్రచార ప్రహసనం చూస్తూ వినోదం పొందిన వారికి కూడా ఈ రోజు ఒక వర్గం వారు చదివిన మ్యానిఫెస్టో విని “ఔరా!” అనిపించింది.
అర్హులైన “మా” మెంబర్ల పిల్లల్ని కేజీ టు పీజీ ఫ్రీగా చదివిస్తారట. ఎవరు అర్హులు? వృద్ధాప్యంలో ఉన్నవారికా అంటే వారి పిల్లలది చదువుకునే వయసు అవ్వదు. నటనలో యాక్సిడెంటయ్యి వికలాంగులైనవారు అర్హులనుకోవచ్చు. అలాంటి వారు 900 మందిలో ఎంతమందుంటారు?
పోనీ సరిగ్గా సంపాదించుకోలేక పేదరికంలో ఉన్న నటులనుకుందాం.. నాలుగైదు సినిమాల్లో నటించి రూ 1 లక్ష (గెలిస్తే కరోనా డిస్కౌంటుగా రూ 75,000 చేస్తారట) అప్పు చేసి కట్టినా సభ్యత్వం వస్తుంది. ఆ తర్వాత ఇక ఎప్పటికీ నటించికపోయినా జీవిత సభ్యుడైన కారణానికి ఆ నటుడి పిల్లల్ని సంస్థ చదివించడమేంటి? సినిమాల్లో కుదరకపోతే వేరే రంగాల్లో పనులుండవా? కేజీ టు పీజీ అంటే మాటలా? అసలు 900 మంది సభ్యుల్లో ఈ బాపతు ఎంతమందున్నారు?
అయినా పర్వాలేదు. అది ప్రజాధనానికి సంబంధించిన అంశం కాదు. వారెక్కడినుంచి విరాళాలు తెస్తారో, ఎలా ఫండ్ రైజింగ్ చేసుకుంటారో వాళ్లిష్టం. కళ్యాణ లక్ష్మి తరహాలో “మా” సభ్యుల పిల్లల పెళ్లిళ్లకి రూ.లక్షన్నర దాకా ఇస్తారట. ఇది కూడా వాళ్ల వ్యవహారమేదోలే అనుకుని వదిలేయొచ్చు.
ఇక అసలైంది…ప్రభుత్వంతో మాట్లాడి అర్హులైన “మా” సభ్యులకి సొంతింటి కల నెరవేరుస్తారట. అంటే వీళ్లకి ప్రభుత్వం ల్యాండివ్వాలన్నమాట. దేశం కోసం ప్రాణాలర్పిస్తేనో, విశేషమైన ప్రజాసేవ చేసి రోడ్డున పడితేనో ప్రభుత్వం స్థలాలిచ్చినా అర్థం ఉంది. సినిమాల్లో నటించి అవకాశాలు కోల్పోయినందుకో, వృద్ధులైనందుకో ప్రభుత్వం “ప్రత్యేకంగా” ఇళ్లెందుకివ్వాలి? ఆల్రెడి పేదలకి ప్రభుత్వ స్కీములున్నాయిగా.
అప్పట్లో ఒక సుప్రసిద్ధ నటుడు సినిమాలు తీసి సంపాదించిందంతా పోగొట్టుకుని నల్లకుంట ఏరియాలో ఒక పాత ఫ్లాట్ లో జీవిత చరమాంకం గడిపారు. మరొక ప్రముఖ గీతరచయిత సంపాదించిందంతా గుర్రప్పందేలకి, విలాసాలకి వాడేసి సొంతిల్లు లేకుండానే పోయారు. అలాంటి వాళ్ల కుటుంబాలని గుర్తించి మానవత్వంతో ఇల్లివ్వమని ప్రభుత్వాన్ని కోరితే అర్థముంటుందా? ప్రభుత్వం ఒకవేళ ఇచ్చినా ప్రజలు తిట్టరూ? సెంటిమెంటేముంది ఇందులో? ఎవరి అజాగ్రత్త వాళ్లది. ఎవరి స్వయంకృతాపరాధం వాళ్లది.
అసలిదంతా చూస్తుంటే ఇంతమంది నటీనటులు ఈ “మా”లో ప్రెసిడెంటు క్యాండిడేట్స్ వెనుక ప్యాడింగ్ ఆర్టిస్టుల్లా నిలబడి వారాల తరబడి గడపడం స్థలకోసమేనేమో అనిపిస్తోంది.
అర్హత అనేది ఏ ప్రాతిపదికన వస్తుంది? ఏదైనా కాగితం మీద ఉన్న దానిని బట్టే కదా. తన పేరుతో ఇల్లే లేదు అని చెప్పి ఆల్రెడీ బినామీల పేరుతో ఇళ్ళున్న మహానుభావులు కూడా ప్రభుత్వం స్థలాలిస్తే చేతివాటం చూపించొచ్చు కదా?
అలా కాదు.. నిజంగా అర్హులకే అందచేస్తారనుకున్నా 900 మంది సభ్యుల్లో అర్హులైనవాళ్లు 250 మందే అని ప్రచారమయ్యింది.
ఈ మధ్య ప్రకాష్ రాజ్ ఇచ్చిన ఒక స్పీచులో ఏదో లెక్క చెప్పి “900 మంది సభ్యుల్లో వెనకబడిన నటీనటులు 250 మందే ఉన్నారు. వాళ్లని ఆదుకోవడం పెద్ద విషయమా” అన్నారు.
నిజానికి ఆ 250 మందిలో ఎంతమంది ఈ “మా” ప్రచార మీటింగులకొస్తున్నారు? వాళ్లని మాత్రం ఓట్లేసే గొర్రెల్లా ఎక్కడో కూర్చోబెట్టి కథ నడుపుతున్నదంతా కారుల్లో తిరిగే పెద్ద చేతులే కదా?
నిజానిజాలెలా ఉన్నా..ఈ ప్రచారాలు, ఈ మ్యానిఫెస్టోలూ చూస్తుంటే ..ఏదో హడావిడి చేసి, ప్రభుత్వం నుంచి స్థలాలు గుంజి మరో ఫిల్మ్ నగరుకో, చిత్రపురి కాలనీకో తెరలేపాలనుకునే వ్యాపార ధోరణే సగటు మనిషికి కనిపిస్తుంది.
వీళ్ల ధోరణి, ఊపు చూస్తుంటే ఈ గోలంతా దూరదృష్టితో చేస్తున్నట్టు అనిపిస్తోంది. అమెరికాలో జరిగే కొన్ని తెలుగు సంస్థల ఎన్నికల్లోని గూడుపుఠాణీలు వచ్చే టర్ములో “మా”లో కూడా చోటు చేసుకుంటాయనిపిస్తోంది. ఇప్పుడు ఇద్దర్లో ఎవరు గెలిచినా వచ్చే ఎన్నికల నాటికి సభ్యుల సంఖ్యని కచ్చితంగా పెంచొచ్చు.
వాళ్లే సొంతవాళ్లకి తమ సినిమాల్లో అవకాశాలిచ్చి “మా” సభ్యత్వానికి అయ్యే డబ్బుకూడా కుదిరితే వాళ్లే కట్టేసి శాశ్వత ఓటు బ్యాంకుని సృష్టించుకోవచ్చు. మంది పెరగడం వల్ల “మా” అధ్యక్షుడి గళానికి బలం రావొచ్చు. శాశ్వతంగా ఒక వర్గమే కుర్చీలో కూర్చోవచ్చు. సినీరంగాన్ని గుప్పెట్లో పెట్టుకోవచ్చు. పర్యవసానంగా పరపతి పెంచుకోవచ్చు.
ఇన్ని అనుమానాలతో ఇంత రాత రాయాల్సిన అవసరమేంటని అడిగితే ఒకటే సమాధానం… 900 మంది సభ్యులతో కూడిన సంస్థ ఎన్నికలు గుట్టు చప్పుడు కాకుండా నాలుగ్గోడల మధ్య జరిగితే ఈ వ్యాసం రాసే అవకాశం ఉండేది కాదు. అవసరం లేకపోయినా పూటకో ప్రెస్ మీట్ పెట్టి ఊకదంపుతుంటే వ్యాసలొస్తాయి మరి. పట్టించుకోనక్కర్లేదంటే ఎలా?
శ్రీనివాస మూర్తి