ప్రస్తుతం మార్కెట్లో 2 సినిమాలపై ఓ రేంజ్ లో ఊహాగానాలు సాగుతున్నాయి. అందులో ఒకటి సలార్. ఈ సినిమా డిసెంబర్ 22కి వచ్చేలా లేదంటూ ప్రచారం నడుస్తోంది. ఇక రెండోది హను-మాన్. ఈ సినిమా సంక్రాంతికి రాదంటూ పుకార్లు. ఈ రెండు రూమర్స్ పై ఒకేసారి క్లారిటీ వచ్చింది. అదేంటో చూద్దాం..
ప్రభాస్ హీరోగా నటిస్తున్న సలార్ సినిమా ఆల్రెడీ ఓసారి వాయిదా పడింది. లెక్కప్రకారం ఈపాటికి థియేటర్లలోకి రావాల్సిన ఈ సినిమాను డిసెంబర్ 22కు తీసుకొస్తున్నారు. అయితే ఆ టైమ్ కు కూడా రాదనే ప్రచారం ఊపందుకుంది. ఈ ప్రచారంపై మేకర్స్ కూడా సైలెంట్ గా ఉండడం మరిన్ని అనుమానాలకు తావిచ్చింది.
ఎట్టకేలకు టీమ్ నుంచి క్లారిటీ వచ్చింది. సలార్ సినిమా డిసెంబర్ 22కే వచ్చి తీరుతుందని మేకర్స్ ప్రకటించారు. రాత్రి దీనికి సంబంధించి సోషల్ మీడియాలో పూర్తి స్పష్టత ఇచ్చారు. ప్రభాస్ ఇలా ల్యాండ్ అవ్వగానే, సలార్ నుంచి ఈ క్లారిటీ వచ్చింది.
ఇక రెండో సినిమా హను-మాన్. తమ సినిమా కచ్చితంగా సంక్రాంతికి వస్తుందంటూ మేకర్స్ చెబుతున్నప్పటికీ, ఈ మూవీపై అనుమానాలు వీడడం లేదు. దీనికి సంబంధించి యూనిట్ మరోసారి స్పష్టత ఇచ్చింది. కచ్చితంగా తాము సంక్రాంతికే వస్తామని ప్రకటించింది. ఈ మేరకు ప్రమోషనల్ ప్లాన్ కూడా సిద్ధం చేసింది.
హను-మాన్ టీజర్ ఇప్పటికే పెద్ద హిట్టయింది. ఇప్పుడీ సినిమా ట్రయిలర్ ను డిసెంబర్ 1న విడుదల చేయాలనుకుంటున్నారు. అలా సంక్రాంతి సినిమాలకు సంబంధించి తమ సినిమా ట్రయిలర్ నే ముందుగా విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
అయితే అంతకంటే ముందే, అంటే మరో 5 రోజుల్లోనే హను-మాన్ సినిమా అధికారిక ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. దాదాపు నెల రోజుల పాటు పాన్ ఇండియా లెవెల్లో ఈ సినిమాకు ప్రచారం చేయబోతున్నారు. మరీ ముఖ్యంగా పిల్లల్ని ఎట్రాక్ట్ చేసేలా హను-మాన్ క్యారికేచర్లు, చిన్న బొమ్మల్ని విడుదల చేయాలని అనుకుంటున్నారు.