ముందొచ్చిన చెవుల కంటె వెనకొచ్చిన కొమ్ములు వాడి అని సామెత. అలాగే… మొత్తం 118 స్థానాల్లో పోటీకి సిద్ధమవుతున్న అసలు పెద్ద పార్టీ కాంగ్రెసు కంటె ముందుగా, వారినుంచి అడిగి పుచ్చుకున్న ఒక్క సీటులో బరిలోకి దిగుతున్న సీపీఐ తమ పనితనాన్ని ప్రదర్శిస్తోంది.
తెలంగాణ ఎన్నికల్లో కొత్తగూడెం ఒకే స్థానంలో పోటీచేస్తున్న సీపీఐ తమ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. అసలు పార్టీ కాంగ్రెస్ ఇప్పటి దాకా సీట్ల సర్దుబాటులోనే తలమునకలు అవుతూ, మేనిఫెస్టోను విడుదల చేయలేని పరిస్థితిలో ఉంది.
నిజానికి సీట్ల విషయంలో ఏర్పడుతున్న చికాకులు కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల చేయడానికి ఆటంకంగా మారే అవకాశం లేదు. ఎందుకంటే.. మేనిఫెస్టో తయారీ కోసం ఆ పార్టీ ప్రత్యేకంగా ఒక కమిటీని ఏర్పాటుచేసింది. దుద్దిళ్ల శ్రీధర్ బాబు దానికి సారధి. వారు రాష్ట్రంలోని అన్ని వర్గాల నుంచి వినతులను స్వీకరించారు. అన్నింటినీ పరిగణనలోకి తీసుకున్నారు. అసలు కాంగ్రెస్ పార్టీనుంచి అందరి కోరికలను అడ్రస్ చేసే ఒక బృహత్ మేనిఫెస్టో వస్తుందని ప్రతిఒక్కరూ ఎదురుచూస్తున్నారు. రావడం నిజమే ఏమో గానీ.. ఎప్పటికి వస్తుంది.. అనేది సందేహంగా మారుతోంది.
కాకపోతే కాంగ్రెసుకు వచ్చిన పెద్ద నష్టమేమీ లేదు. రాబోయే మేనిఫెస్టోలో అందరి తృప్తికోసం హామీలు ఉంటాయేమో గానీ.. నిజానికి ఓట్లు రాల్చడానికి వారు ప్రధానంగా ఫోకస్ పెడుతున్న ఆరు హామీలు ఇప్పటికే ప్రజల్లోకి వెళ్లిపోయాయి. వారు వాటి మీదనే డిపెండ్ అవుతున్నారు.
మరోవైపు సీపీఐ ఒకే సీటులో పోటీచేస్తున్నప్పటికీ.. ప్రజల్లో ఒక నమ్మకం కలిగించేలాగా మేనిఫెస్టో తేవడం విశేషం. పేద మధ్యతరగతి వారికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు, కేరళలాగా రేషన్ షాపుల్లో 13 రకాల నిత్యావసరాల పంపిణీ, పేదలందరికీ ఇళ్లస్థలాలు, ఇంటి నిర్మాణానికి పదిలక్షల ఆర్థిక సాయం వంటి మహా హామీలు వీరి మేనిఫెస్టోలో ఉన్నాయి.
అయినా ఇక్కడ సామాన్యులకు కలిగే సందేహం ఒకటుంది. సీపీఐ మేనిఫెస్టో ను నమ్మేదెలా? ఇదే హామీలకు కాంగ్రెస్ పార్టీతో కూడా వారు ఓకే అనిపించగలరా? అనేది ప్రజల సందేహం. 200 యూనిట్లు, రేషన్ సరుకుల వరకు ఓకే, పేదలకు ఇంటికోసం రూ.పది లక్షల ఆర్థిక సాయం లాంటివి సర్కారుకు గుదిబండగా మారుతాయి.
ఒక్క సీటులో గెలవడానికి ఇంత పెద్ద మాటలు చెబుతున్న సీపీఐకు పోయేదేం లేదు. వారితో పొత్తుపెట్టుకున్నందుకు.. వారు ఇచ్చిన మేనిఫెస్టో హామీలన్నీ తామే తీర్చాలంటే.. కాంగ్రెస్ సర్కారుకు మాత్రం తలనొప్పే అవుతుంది.