కేసీఆర్ వ్యతిరేక శక్తులను, వ్యక్తులను పూర్తిస్థాయిలో ఒక దరికి చేర్చడంలో కాంగ్రెసు పార్టీ చాలా బిజీబిజీగా ఉంది. కేసీఆర్ ను ఆయన కుటుంబాన్ని ఆయన పాలనను దుమ్మెత్తిపోయగల తెగువ ఉన్నవాళ్లందరినీ.. తమ పార్టీలో చేర్చుకుంటోంది. లేదా.. తమకు అనుకూలంగా పనిచేసేలా వారి మద్దతు తీసుకుంటోంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే.. భారతీయ జనతా పార్టీలోని వారు తప్ప.. కేసీఆర్ పట్ల ద్వేషంతో, ఆగ్రహంతో రగిలిపోయే ప్రతి నాయకుడు ఇవాళ కాంగ్రెస్ గూటికి చేరి ఆయన పతనాన్ని నిర్దేశించాలని ఆరాటపడుతున్నారు.
వైఎస్సార్ తెలంగాణ పార్టీని స్థాపించి.. కేసీఆర్ మీద ఒక రేంజిలో విమర్శనాస్త్రాలు సంధిస్తూ బాగా పాపులర్ అయిన షర్మిల.. ఎన్నికల సమయం వచ్చేసరికి పార్టీ యాక్టివిటీని పరిమితంచేసి.. కాంగ్రెసుకు అనుకూలంగా పనిచేస్తున్నారు. అసలు ఆమె తన పార్టీని కాంగ్రెసులోనే విలీనం చేయాలని అనుకున్నప్పటికీ.. ఆ ప్రయత్నాలు ఒక కొలిక్కి రాలేదు. ఏకంగా 119 స్థానాల్లో పోటీచేస్తానని ప్రకటించిన ఆమె.. పూర్తిగా ఎన్నికలకు దూరంగా ఉండి కాంగ్రెసుకు మద్దతిస్తానని ప్రకటించేశారు.
బహుశా ఆమె రేపో మాపో స్వయంగా ఎన్నికల ప్రచారంలోకి దిగే అవకాశం కూడా ఉంది. నామినేషన్ల ఉపసంహరణ కూడా పూర్తయిన తర్వాత.. ఆ ప్రచార అంకం మొదలు కావొచ్చు.
తెలంగాణ జనసమితి కూడా ఇప్పుడు అదే దశలో ఉంది. కేసీఆర్ మీద నిశిత విమర్శలు, సిద్ధాంతపరమైన విమర్శలు చేయగల ప్రొఫెసర్ కోదండరాం కూడా ఇప్పుడు కాంగ్రెస్ అమ్ముల పొదిలోనే ఉన్నారు.
తాజాగా.. తీన్మార్ మల్లన్న కూడా కాంగ్రెస్ జట్టులో చేరారు. కేసీఆర్ మీద తీవ్రస్థాయిలో విరుచుకుపడిపోతూ.. సోషల్ మీడియా పోస్టులు, యూట్యూబ్ చానెల్ ద్వారా ఎంతో పాపులర్ అయిన మల్లన్న మీద సర్కారు పెద్దస్థాయిలో కేసులతో విరుచుకుపడింది. కేసు మీద కేసు పెట్టింది. ఒక బెయిలు వస్తే.. వెంటనే రెండో కేసులో అరెస్టు చేస్తూ వేధించింది. ఈ వేధింపులు తాళలేక బిజెపిలో చేరిన మల్లన్న అక్కడ ఇమడలేకపోయారు. మధ్యలో సొంత పార్టీ అని కొంత హడావుడి చేశారు.
చివరికి ఇప్పుడు టికెట్ల ఎంపిక పర్వం కూడా పూర్తయిన తర్వాత.. కాంగ్రెసు పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఆయనకు అటువైపు నుంచి ఏం హామీ లభించిందో మనకు తెలియదు గానీ.. ఈ ఎన్నికల్లో తీన్మార్ మల్లన్న తన తీవ్రమైన పదజాలపు విమర్శలతో కేసీఆర్, భారాసకు వ్యతిరేకంగా గళం వినిపిస్తారు. మొత్తానికి ఆరకమైన అందరినీ తమ పార్టీలోకి రాబడుతూ.. కాంగ్రెస్ ఎడ్వాంటేజీ తీసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నట్టుగా కనిపిస్తోంది.