దర్శకుడు ప్రశాంత్ వర్మ చాన్నాళ్ల నుంచి ఊరిస్తున్నారు. ఇదిగో ట్రయిలర్.. అదిగో హనుమాన్ సినిమా అంటూ. టీజర్ వచ్చే వరకు ఆ సినిమా మీద ఏ అంచనాలు లేవు. టీజర్ వచ్చి ఆ సినిమా మీద కొన్ని అంచనాలు ఏర్పరిచింది. అప్పటి నుంచి హనుమాన్ సినిమా మీద ఆసక్తి పెరిగింది.
తెలుగు లో ఓ రేంజ్ సినిమా అనుకున్నది పాన్ ఇండియా సినిమాగా మారింది. సంక్రాంతికి విడుదల అని ఏనాడో ఫిక్స్ అయ్యారు. అయితే చాలా సినిమాలు వచ్చి పడడంతో, డేట్ మారుద్దాం అని అనుకున్నా, బాలీవుడ్ విడుదల వల్ల వీలు కాని పరిస్థితి. బాలీవుడ్ రిలీజ్ ఫిక్స్ కావడంతో, సంక్రాంతికే డేట్ ను లాక్ చేసారు.
అందుకే ఇప్పుడు సంక్రాంతి విడుదల పబ్లిసిటీ స్టార్ట్ చేస్తున్నారు. ఈ నెల 14న ఓ పాట విడుదల చేస్తున్నారు. దాంతో పాటే చిన్న కామిక్ బుక్ కూడా. డిసెంబర్ 1న ట్రయిలర్ విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఒక ట్రయిలర్ అని కాకుండా వీలైతే రెండు లేదా అంతకు మించి వదలాలి అన్నది ఆలోచన. సరిగ్గా రెండు నెలల పాటు పాన్ ఇండియా మొత్తం పబ్లిసిటీకి ప్లాన్ చేస్తున్నారు దర్శకుడు ప్రశాంత్ వర్మ. తెలుగు, హిందీకి ఎక్కువ సమయం కేటాయిస్తారు.
సినిమా కంటెంట్ మీద, జానర్ మీదనే పబ్లిసిటీ అంతా ఆధారపడింది. ఎందుకంటే సినిమాలో సూపర్ స్టార్ ఎవరూ హీరో కాదు. తేజ సజ్జా రేంజ్ ఈ సినిమా తరువాత పెరగాల్సి వుంటుంది. ఈ సినిమా వరకు మాత్రం కంటెంట్, హనుమాన్ నే హీరో. అందుకే ఆ దిశగా పబ్లిసిటీ ప్లానింగ్ అంతా వుంటుంది. ఇప్పటికే హనుమాన్ చాలీసా విడుదల చేసారు. ఇప్పుడు కొత్త సూపర్ స్టార్ వచ్చాడు అనే టైపులో పాట వదలుతారు.