సెన్సార్ చేస్తే ఒక బాధ, చేయకపోతే మరో బాధ అన్నట్టు తయారైంది వ్యూహం సినిమా. ఇప్పటికే ఈ సినిమాను సెన్సార్ చేసేందుకు సభ్యులు అభ్యంతరం తెలిపారు. ఈ మేరకు హైదరాబాద్ లోని సెన్సార్ రీజనల్ బోర్డ్, తమ విముఖతనకు తెలియజేస్తే, రివైజ్ కమిటీకి సిఫార్స్ చేసింది.
ఇప్పుడు అక్కడ మరో వ్యవహారం మొదలైంది. రివైజ్ కమిటీలో జీవిత రాజశేఖర్ సభ్యురాలిగా ఉన్నారు. అక్కడ వ్యూహం సెన్సార్ పూర్తవుతుందని అంతా అనుకున్న టైమ్ లో నట్టికుమార్ అడ్డుపుల్ల వేశారు.
రీవైజ్ సెన్సార్ కమిటీలో ఉన్న జీవితను ఈ సినిమా వరకు సెన్సార్ చేయకుండా తప్పించాలని సెన్సార్ చైర్మన్ కు ఫిర్యాదు చేశారు నట్టికుమార్. అక్కడితో ఆగలేదాయన. తెలంగాణ హైకోర్టులో కేసు కూడా వేశారు. జీవిత రాజశేఖర్ గతంలో వైసీపీ, ఇప్పుడు బీజేపీలో ఉన్నారని, ఆమె ఉంటే వ్యూహం సినిమా సెన్సార్ కు న్యాయం జరగదన్నారు.
ముంబయి, కర్నాటక లాంటి పొరుగు రాష్ట్రాల సెన్సార్ సభ్యులో వ్యూహం సినిమాకు సెన్సార్ చేయించాలనేది నట్టికుమార్ వాదన. దీనిపై హైకోర్టులో ఒక దశ వాదనలు ముగిశాయి. కేసును కోర్టు వారం రోజుల పాటు వాయిదా వేసింది.
మరోవైపు ఎలక్షన్ కమిషన్ ను కూడా ఇంప్లీడ్ చేయడంతో, ఈ సెన్సార్ వ్యవహారం మరింత క్లిష్టంగా మారింది. ఓవైపు వర్మ మాత్రం వ్యూహం సినిమా ప్రచారాన్ని, తన సోషల్ మీడియా వేదికపై కొనసాగిస్తూనే ఉన్నారు. వైఎస్ జగన్ రాజకీయ జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే.