కాంగ్రెస్ నాయకుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కావడానికి విపరీతంగా కష్టపడుతున్న రేవంత్ రెడ్డి తన విజన్ ను వెల్లడించారు. ఇండియా టుడే నిర్వహించిన ఓ కార్యక్రమంలో అభివృద్ది-సంక్షేమం రెండూ ఎలా సాధ్యం అరకొర నిధులతో అన్న ప్రశ్నకు సమాధానంగా ఈ విషయం వెల్లడించారు.
గమ్మత్తేమిటంటే అడిగిన ప్రశ్న వేరు. చెప్పిన సమాధానం వేరు. సంక్షేమానికి నిధులు ఖర్చు చేస్తే అభివృద్ది ఎలా అన్నది ప్రశ్న. ఇక్కడ అభివృద్ది అంటే కేవలం కొత్త రోడ్లు.. వంతెనలు.. భవనాలు మాత్రమే కాదు. ఇప్పటికే వున్న వాటి నిర్వహణ. దాని గురించి చెప్పలేదు రేవంత్ రెడ్డి.
రాచకొండ గుట్టల ఏరియాలో లాండ్ పూలింగ్ చేసి ఓ కొత్త సిటీని నిర్మిస్తామన్నారు. అమరావతి స్కీమ్ ను ఇక్కడ అమలు చేస్తామన్నారు. కార్పొరేట్ కంపెనీలను ఆహ్వానించి, భూములు ఇచ్చి అభివృద్ది సాధిస్తామన్నారు. ఇటు పక్క అంతా జనాలతో కిట కిట లాడిపోతున్నందున అటు కొత్త సిటీ నిర్మిస్తామన్నారు. క్లస్టర్ల కింద విభజించి వివిధ వ్యాపారాలకు కేటాయింపులు చేస్తారట.
రేవంత్ రెడ్డి గమనించాల్సింది ఏమిటంటే, కొత్త సిటీ నిర్మించినంత మాత్రాన హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ మారిపోవు. అక్కడ వుండేవారు అంతా అటు తరలివెళ్లిపోరు. అలా అయితే గోపన్నపల్లి, పోచారం లాంటి ఏరియాలు ఇప్పటికే కిటకిట లాడిపోతూ వుండాలి. కానీ అలా జరగడం లేదు. జనాలు అంతా ఇక్కడి నుంచి అక్కడికి వెళ్లి వస్తున్నారు తప్ప అక్కడ సెటిల్ కావడం లేదు.
సరే, కొత్త సిటీ కట్టి పాత మూడు నగరాల మీద వత్తిడి తగ్గించడం మంచి ఆలోచనే అనుకుందాం. అప్పుడు కూడా డెవలప్ మెంట్ కు డబ్బులు కావాలి. కొత్త సిటీకి అక్కర లేకపోవచ్చు. భూముల కోసం కంపెనీ లు రావచ్చు. మరి ఇప్పటికే వున్న రోడ్లు, భవనాల సంగతేమిటి? ఇక్కడ కూడా ఇన్ ఫా స్ట్రక్చర్ పెంచాలి కదా. గత పదేళ్లలో సిటీలో ఎన్ని ఫ్లయ్ ఓవర్లు కట్టారు. రోడ్లు వేసారు. అండర్ పాస్ లు కట్టారు. ఇలా చేసుకుంటూ వెళ్లాల్సిందే.
అప్పుడు అప్పులు తప్పని సరి. ఆంధ్రలో జరుగుతున్నది అదే. జగన్ ను తప్పు పడుతున్న వారంతా మళ్లీ అదే రూట్ లోకి వెళ్తున్నారు. అది చంద్రబాబు అయినా, కాంగ్రెస్ అయినా. జనాలకు తాయిలాలు ఇస్తామనే చెబుతున్నారు. అయితే జనం నిలదీస్తారు అనే భయంతో, అభివృద్ది కూడా సాధిస్తాం అనే కబుర్లు చెబుతున్నారు. అది అయ్యే పని కాదు అని తెలియడానికి ఎంతో కాలం పట్టదు.