హాలీవుడ్ స్టయిల్ లో ఏడాది ముందే రిలీజ్ డేట్స్ ఫిక్స్ అయిపోవాలని చెబుతుంటాడు నిర్మాత సురేష్ బాబు. సినిమా మేకింగ్ కూడా కార్పొరేట్ స్టయిల్ లో ఉండాలని, రిలీజ్ డేట్ వ్యవహారాలన్నీ ప్రొఫెషనల్ గా ఉండాలని ఊదరగొడుతుంటాడు. ఇన్ని చెప్పే సురేష్ బాబే, తన సినిమాకు రిలీజ్ డేట్ ఫిక్స్ చేయడంలో తెగ నాన్చుతున్నాడు. ఇంకా చెప్పాలంటే అన్-ప్రొఫెషనల్ గా వ్యవహరిస్తున్నాడు.
సురేష్ బాబు ఈ వ్యవహారశైలిని ఎండగడుతూ సోషల్ మీడియాలో ఇప్పుడో ఫన్నీ హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్ అవుతోంది. “వెంకీమామ రిలీజ్ ఎప్పుడమ్మా” అనేది ఆ హ్యాష్ ట్యాగ్. సురేష్ బాబును ట్యాగ్ చేస్తూ.. ఈ హ్యాష్ ట్యాగ్ ను ట్రెండ్ చేస్తున్నారు వెంకటేష్, నాగచైతన్య అభిమానులు.
నిజానికి ఈ విషయంలో తప్పంతా సురేష్ బాబుదే. ఏదో ఒక రిలీజ్ డేట్ కు ఫిక్స్ అయితే బాగుండేది. ముందుగా సంక్రాంతి రిలీజ్ అని ఊరించాడు. ఆ తర్వాత డిసెంబర్ 13 అన్నాడు. ఇప్పుడు కొత్తగా డిసెంబర్ 25 అంటూ మరో తేదీ తెరపైకి వచ్చింది. దీనికి తోడు ఈ సినిమా మళ్లీ సంక్రాంతి బరిలోనే దిగుతుందంటూ మరో ప్రచారం.
ఇలా గందరగోళంగా తయారైంది వెంకీమామ విడుదల వ్యవహారం. బాధాకరమైన విషయం ఏంటంటే.. ఈ మొత్తం ప్రహసనంలో వెంకీ పుట్టినరోజైన డిసెంబర్ 13ను కూడా కామెడీ చేసి పడేశారు ఇతర హీరోల అభిమానులు. దీంతో బాగా హర్ట్ అయిన వెంకీ అభిమానులు, సురేష్ బాబును ట్యాగ్ చేస్తూ.. “వెంకీమామ రిలీజ్ ఎప్పుడమ్మా” అంటూ ఓ హ్యాష్ ట్యాగ్ ను పాపులర్ చేస్తున్నారు.
సురేష్ బాబు లాంటి సీనియర్ ప్రొడ్యూసర్ వ్యవహరించాల్సిన పద్ధతి ఇది కాదు. ప్రస్తుతానికైతే డిసెంబర్ 25పై ఎక్కువగా స్పెక్యులేషన్ నడుస్తోంది. కనీసం ఆ తేదీకైనా కమిట్ అవుతారా లేదా అనేది చూడాలి.