తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన ప్రియాంకరెడ్డి హత్య కేసులో ఆమె తండ్రి చేసిన విజ్ఞప్తి ఇప్పుడు అందర్నీ ఆలోచింపజేస్తోంది. తన కూతుర్ని అత్యాచారం చేసి, దారుణంగా హింసించి చంపిన నరరూప రాక్షసుల తరఫున ఏ లాయర్ వాదించకూడదని ప్రియాంక తండ్రి శ్రీధర్ రెడ్డి అభ్యర్థించిన విషయం తెలిసిందే. దీనిపై లాయర్లు సానుకూలంగా స్పందించారు.
ప్రియాంక కేసులో నిందితులుగా ఉన్న నలుగురిలో ఏ ఒక్కరి తరఫున వాదించకూడదని మహబూబ్ నగర్ బార్ అసోసియేషన్ నిర్ణయం తీసుకుంది. కేవలం వాదించకుండా సహాయ నిరాకరణ చేయడమే కాకుండా.. ఆ నలుగురికి కఠిన శిక్ష పడేవరకు పోరాటం చేస్తామని బార్ కౌన్సిల్ ప్రకటించింది. లాయర్లంతా మూకుమ్మడిగా తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది.
లాయర్లు తీసుకున్న నిర్ణయంతో ఈ కేసు త్వరితగతిన కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. పైగా ఫాస్ట్ ట్రాక్ కోర్టులో ఈ కేసును విచారించనుండడంతో తొందరగా తీర్పు వచ్చే ఛాన్స్ ఉంది. మరోవైపు.. నిందితులు నలుగుర్ని సీపీ ఆఫీస్ నుంచి షాద్ నగర్ పోలీస్ స్టేషన్ కు ఈరోజు ఉదయం తరలించారు. మరికొద్దిసేపట్లో మహబూబ్ నగర్ ఫాస్ట్ ట్రాక్ కోర్టులో వీళ్లను ప్రవేశపెట్టబోతున్నారు.
అటు నిందితుల్లో ఒకరైన చెన్నకేశవులు తల్లి ఈ కేసుపై స్పందించింది. ఏ తల్లిదండ్రులకు ఇలాంటి కష్టం రాకూడదని బాధపడిన చెన్నకేశవులు తల్లి జయమ్మ.. తన కొడుక్కి ఎలాంటి శిక్ష వేసినా అందుకు అంగీకరిస్తానని తెలిపింది. ఈమధ్యే చెన్నకేశవులు ప్రేమవివాహం చేసుకున్నాడు. గత కొంతకాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో కూడా బాధపడ్డాడు. అలాంటి వ్యక్తి ఇలాంటి ఘాతుకానికి పాల్పడతాడని కలలో కూడా ఊహించలేదంటోంది జయమ్మ.