బిగ్‌బాస్‌లో మార్కులు కొట్టేసిన గీతూ

సౌమ్య‌త‌, మంచిత‌నం, న‌లుగురిని క‌లుపుకుని పోవ‌డం ఇవ‌న్నీ బిగ్‌బాస్‌కి న‌చ్చ‌ని ప‌దాలు. అరుచుకుంటూ, గొడ‌వ‌లు ప‌డుతూ, స‌వాల్ చేసుకుంటూ వుంటే మార్కులు ప‌డ‌తాయి. జ‌నానికి కూడా ఇదే ఇష్టం. ఎవ‌రెటు పోయినా ప‌ర్లేదు, మ‌నం…

సౌమ్య‌త‌, మంచిత‌నం, న‌లుగురిని క‌లుపుకుని పోవ‌డం ఇవ‌న్నీ బిగ్‌బాస్‌కి న‌చ్చ‌ని ప‌దాలు. అరుచుకుంటూ, గొడ‌వ‌లు ప‌డుతూ, స‌వాల్ చేసుకుంటూ వుంటే మార్కులు ప‌డ‌తాయి. జ‌నానికి కూడా ఇదే ఇష్టం. ఎవ‌రెటు పోయినా ప‌ర్లేదు, మ‌నం గెల‌వాలి. మ‌న ప‌ని జ‌ర‌గాలి ఇది ఇప్ప‌టి ట్రెండ్‌. బిగ్‌బాస్‌లో జ‌రుగుతున్న‌ది, జ‌రిగేది, బ‌య‌ట కూడా కాస్త అటుఇటూగా జ‌రుగుతుంది.

బిగ్‌బాస్ ఆంత‌ర్యం గ్ర‌హించ‌లేక షానీ, అభిన‌య బ‌య‌టికి వెళ్లిపోయారు. సేఫ్ గేమ్ ఆడిన ఫ‌లితం. షానీ అయితే అంద‌రితో మంచిగా వుంటూ టైమ్ వ‌చ్చిన‌పుడు ఆట చూపిస్తా అనుకున్నాడు. అయితే ప్ర‌తి క్ష‌ణం విలువైంది, త‌న ప్ర‌తి క‌ద‌లిక రికార్డు అవుతుంద‌ని తెలుసుకోలేక వెళ్లిపోయాడు. ప్ర‌తి వారం ఎవ‌రో ఒక‌రు వెళ్లిపోవాల్సిందే క‌దా అనుకుంటే గ‌తంలో ఫ‌స్ట్ వీక్‌లో (ఈ సారి ఫ‌స్ట్ వీక్ ఎలిమినేష‌న్ స్కిప్ చేసి, సెకెండ్ వీక్ డ‌బుల్ ఎలిమినేష‌న్‌) వెళ్లిన వాళ్లు కూడా ఎంతోకొంత ఆడారు. ఎలాంటి ముద్ర లేకుండా వెళ్లింది షానీనే. ఇక అభిన‌య పాట‌ల‌కి డ్యాన్స్‌లు చేయ‌డం, ఒక చోట కూచుని క‌బుర్లు చెప్ప‌డం త‌ప్ప చేసింది లేదు.

గీతూ విష‌యానికి వ‌స్తే మొద‌ట్లో అరుస్తూ చాలా చిరాకు పెట్టింది. సెంటిమెంట్లు లేవ‌ని, గెల‌వ‌డానికే గేమ్ ఆడ‌తాన‌ని చెప్పింది. ఆమె మాట‌, ప్ర‌వ‌ర్త‌న‌ని ఆడియ‌న్స్ కూడా భ‌రించ‌లేక‌పోయారు. కానీ బేబీ టాస్క్‌లో గీతూ ఆట పీక్స్‌లో వుంది. బొమ్మ‌ని స్టోర్ రూమ్‌లో దాచ‌డంతో , దాన్ని వెత‌క‌డానికి మిగిలిన వాళ్లంతా నిద్ర పోకుండా క‌ష్ట‌ప‌డ్డారు. ఎలాంటి మంచిత‌నానికి వెళ్ల‌కుండా, ఎవ‌రి బొమ్మ దొరికినా కాజేసి వాళ్ల‌ని అన‌ర్హుల్ని చేసింది. తొండి ఆడ‌డ‌మే బిగ్‌బాస్ అర్హ‌త అని ఆమె గ్ర‌హించిన‌ట్టుగా మిగ‌తా వాళ్ల‌కి చేత‌కాలేదు. అందుకే నాగార్జున కూడా 200 శాతం ఆట ఆడావ‌ని మెచ్చుకున్నారు. మిగ‌తా వాళ్ల‌కి మొట్టిక్కాయ‌లు వేసాడు. తిని రిలాక్స్ కావ‌డానికి బిగ్‌బాస్‌కి వ‌చ్చారా? అని చుర‌క‌లు వేసాడు. దాంతో ఈ వారం అంద‌రూ మాస్క్‌లు తీసి ఆడాల్సి వుంది.

ఈ సారి రేటింగ్స్ కూడా త‌క్కువ‌గా ఉండ‌డంతో ఆట‌ని మెరుగు చేయాల‌ని నాగార్జున కొర‌డా తీసాడు. అయితే ఆట‌గాళ్లే డ‌ల్‌గా ఉన్నారు. సుదీప‌, మెరినా ఎప్పుడూ వంట చేస్తూ సోమిదేవ‌మ్మ క‌బుర్లు చెబుతూ వుంటారు. శ్రీ‌స‌త్య అంతా “భ్రాంతియేనా” అని త‌న‌లో తాను పాడుకుంటూ వుంది. నేహా అప్పుడ‌ప్పుడు హుషారుగా వుంటుంది. వాసంతి కూల్‌గా ఏ ఫీలింగ్ వుండ‌దు. ఉన్న‌వాళ్ల‌లో పైమా, ఆరోహి మెరుగు.

బాలాదిత్య అంద‌రినీ చిట్టి త‌ల్లి, బంగారు త‌ల్లి అని సేఫ్ గేమ్‌లో వున్నాడు. ఆదిరెడ్డి హౌస్‌లో కూడా స‌మీక్ష‌కుడి పాత్ర పోషిస్తున్నాడు. రోహిత్ గ‌ట్టిగా మాట్లాడితే మెరీనాకి కోపం వ‌స్తుంద‌న్న‌ట్టు వుంటాడు. అర్జున్‌, రాజ్‌ల‌కి ఇంకా బిగ్‌బాస్ అర్థం కాలేదు. రేవంత్‌, సూర్య‌లు ఏదో బండి లాగుతున్నారు. చంటికి హ‌ఠాత్తుగా త‌ను క‌మెడియ‌న్ అని గుర్తొస్తుంది. ప‌రిస్థితి ఇలాగే వుంటే డ‌బుల్ ఎలిమినేష‌న్‌తో కొంద‌రిని తొంద‌ర‌గా సాగ‌నంపి, వైల్డ్ కార్డ్ ఎంట్రీతో కొత్త‌వాళ్లు వ‌చ్చేస్తారు.

బిగ్‌బాస్ అంటేనే క‌త్తులు నూరుకుని, కొట్టుకు చావ‌డం. ముందు నుంచో, వెనుక నుంచో పొడ‌వ‌క‌పోతే బిగ్‌బాస్‌కి రావ‌డం ఎందుకు? హౌస్‌ని ఫ్యామిలీ అనుకునే అమాయ‌కులు ఇంటికి వెళ్లి సొంత ఫ్యామిలీతో వుంటారు. గీతూలాంటి వాళ్లు రేస్‌లో వుంటారు. బ‌య‌ట కూడా వీళ్లే గెలుస్తారు. మీ చుట్టూ ఒక‌సారి జాగ్ర‌త్త‌గా చూడండి.