టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, ఆయన తనయుడు లోకేశ్‌లతో తాడోపేడో తేల్చుకునేందుకు ఆ పార్టీ సీనియర్ నాయకురాలు, మాజీ మంత్రి భూమా అఖిలప్రియ సిద్ధమయ్యారా? అంటే ఔననే సమాధానం వస్తోంది. ఈ సమయంలో వేగంగా పావులు కదపకపోతే రాజకీయంగా శాశ్వతంగా నష్టపోతామనే ఆలోచనలో అఖిలప్రియ ఉన్నట్టు సమాచారం. తనకు సంబంధం లేని నంద్యాల నియోజకవర్గ రాజకీయాల్లోకి ఆమె ప్రవేశించారు.
నంద్యాలలో ఇప్పటికే అఖిలప్రియ అన్న, మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి ఇన్చార్జ్గా కొనసాగుతున్నారు. అలాగే సీనియర్ నాయకుడు ఫరూక్, ఏవీ సుబ్బారెడ్డి ఉన్నారు. వీరు చాలదన్నట్టు అఖిలప్రియ నంద్యాల రాజకీయాల్లో వేలు పెట్టారు. ఆళ్లగడ్డలో పరిస్థితి బాగాలేదని, చక్కదిద్దుకోవాలని ఇప్పటికే చంద్రబాబు, లోకేశ్ పలుమార్లు చెప్పారని సమాచారం. సొంత నియోజకవర్గం ఆళ్లగడ్డతో పాటు నంద్యాల కూడా తన కుటుంబ సొత్తుగా ఆమె భావిస్తున్నారు.
నంద్యాలలో అఖిలప్రియ ఆదివారం నూతన కార్యాలయం ప్రారంభించడంతో టీడీపీలో మూడు ముక్కలాట మొదలైందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తానుండగా, అఖిలప్రియ నంద్యాలలో ప్రవేశించడంపై భూమా బ్రహ్మానందరెడ్డి గుర్రుగా ఉన్నాయి. చెల్లిపై అధిష్టానానికి బ్రహ్మానందరెడ్డి ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. నంద్యాలలో అఖిల ఆధ్వర్యంలో నూతన కార్యాలయ ప్రారంభాన్ని అడ్డుకోవాలని చంద్రబాబు, లోకేశ్ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడిని ఆదేశించినట్టు సమాచారం.
టీడీపీ జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి మొదలుకుని అచ్చెన్నాయుడు వరకూ పలువురు అఖిలతో మాట్లాడినప్పటికీ ఎలాంటి ప్రయోజనం లేదని సమాచారం. నంద్యాలలో అఖిలప్రియ ప్రవేశం వెనుక ఆమె మాస్టర్ ప్లాన్ వేరే వుంది. ఆళ్లగడ్డ టికెట్ నీకే అని, ప్రచారం చేసుకోవాలని, నంద్యాలను పట్టించుకోవద్దని టీడీపీ అధిష్టానం అనాలనేది ఆమె వ్యూహం. అప్పుడు నంద్యాలను విడిచి పెట్టాలనేది అఖిలప్రియ ఎత్తుగడ.
దీన్ని పసిగట్టిన టీడీపీ అధిష్టానం అఖిలప్రియ బ్లాక్‌మెయిల్‌కు తలొగ్గలేదు. దీంతో తాను తగ్గేదే లే అని అఖిలప్రియ తన చర్యల ద్వారా అధిష్టానానికి తేల్చి చెప్పడానికే మొగ్గు చూపారు. ఆళ్లగడ్డలో తనను పక్కన పెడతారనే అనుమానంతోనే అఖిలప్రియ అధిష్టానానికి ఝలక్ ఇవ్వాలని నిర్ణయించుకున్నారని తెలిసింది. అఖిలప్రియ కార్యాలయ ప్రారంభానికి టీడీపీ ప్రముఖులెవరూ హాజరు కాలేదు. కానీ ఆళ్లగడ్డలో టికెట్ చేజారితే, ఇక శాశ్వతంగా రాజకీయానికి సమాధే అని అఖిలప్రియ భయాందోళనలో వున్నారు.
ఈ నేపథ్యంలో టీడీపీ అధిష్టానంతో ఏదో ఒకటి తేల్చుకునేందుకే … తెగించి నంద్యాలలో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారనే చర్చకు తెరలేచింది. అధిష్టానంతో పోరాడితే పోయేదేమీ లేదు…వస్తే టికెట్, లేదంటే ప్రత్యామ్నాయ పార్టీని ఎంచుకోవడమే అని సన్నిహితుల వద్ద అఖిలప్రియ అంటున్నారని సమాచారం. టీడీపీతో తెగేవరకూ లాగడానికే సిద్ధమైనట్టు కనిపిస్తోందని ఉమ్మడి కర్నూలు జిల్లాకు చెందిన సీనియర్ టీడీపీ నేత ఒకరు చెప్పారు.